ఈ మధ్య కాలంలో చాలా మంది తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రధాన సమస్య.. తమ పిల్లల ఎత్తు సరిగ్గా పెరగకపోవడం. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే, మీరు కూడా ఈ విధమైన ఆందోళనను ఎదుర్కొంటూ ఉండవచ్చు. సాధారణంగా పిల్లల శారీరక ఎదుగుదలకు కేవలం జన్యుపరమైన లక్షణాలే కాకుండా, వారు తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. కొన్ని రకాల అవసరమైన పోషకాలు లోపించడం వల్లే పిల్లల పెరుగుదల మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పిల్లల ఎదుగుదలకు పోషకాలు ఎందుకు ముఖ్యం?
బాల్యం, కౌమార దశ అనేవి పిల్లల జీవితంలో అత్యంత కీలకమైన మైలురాళ్లు. ఈ సమయంలో వారి శరీర ఎదుగుదల చాలా వేగంగా జరుగుతుంది. ఈ కీలక దశలో వారి శరీరానికి సరిపడా ప్రోటీన్లు, విటమిన్లు , ఖనిజాలు అందడం ఎంతో అవసరం. ఒకవేళ వారి రోజువారీ ఆహారంలో పోషకాల లోపం ఏర్పడితే, అది ఎముకలు, కండరాల బలాన్ని తగ్గించి, వారి సహజసిద్ధమైన సాధారణ శరీర ఎదుగుదలను పూర్తిగా మందగింపజేస్తుంది.
ఎత్తు పెరగడానికి సహాయపడే ముఖ్యమైన పోషకాలు
పిల్లలు చక్కగా ఎత్తు పెరగడానికి ఐదు రకాల ముఖ్యమైన పోషకాలు తోడ్పడతాయి. అందులో మొదటిది ప్రోటీన్, ఇది శరీరంలోని కండరాలు , కొత్త కణజాలాల పెరుగుదలకు ప్రధానంగా సహాయపడుతుంది. దీనికోసం పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు, సోయా వంటి పదార్థాలను పిల్లల ఆహారంలో చేర్చాలి. అలాగే ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం చాలా అవసరం కాబట్టి పాలు, పెరుగు, పనీర్ , ఆకుకూరలను క్రమం తప్పకుండా ఇవ్వాలి. అయితే మనం తీసుకునే ఆహారంలోని కాల్షియంను శరీరం సరిగ్గా గ్రహించాలంటే విటమిన్ డి ఉండాల్సిందే, ఇది ఉదయపు లేత సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. వీటితో పాటు శరీరానికి ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి ఇనుము (ఐరన్) ఎంతో అవసరం, దీని లోపం వల్ల పిల్లల్లో బలహీనత , పెరుగుదల సమస్యలు తలెత్తుతాయి. చివరగా జింక్ , మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా శరీర సాధారణ ఎదుగుదలకు తోడ్పడటంతో పాటు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
పిల్లల అభివృద్ధికి అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులు
పిల్లలు శారీరకంగా, మానసికంగా యాక్టివ్‌గా ఉంటూ ఎత్తు పెరగాలంటే కేవలం మంచి ఆహారమే కాకుండా వారి దినచర్యలో కొన్ని మంచి అలవాట్లను అలరచాలి. పిల్లలు ప్రతిరోజూ రాత్రి వేళల్లో తగినంత సమయం నిద్రపోయేలా చూడాలి. అలాగే కేవలం ఇళ్లకే పరిమితం కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరుబయట ఆటలు ఆడటం , వివిధ శారీరక శ్రమతో కూడిన బహిరంగ కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. దీనితో పాటు అన్ని రకాల పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని అందిస్తూ, శరీరం డీహైడ్రేట్ కాకుండా రోజులో పుష్కలంగా నీరు తాగేలా చూసుకోవాలి.
పిల్లలు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన అలవాట్లు
పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే వారిని కొన్ని అనాగరిక అలవాట్లకు దూరంగా ఉంచడం తల్లిదండ్రుల బాధ్యత. ముఖ్యంగా జంక్ ఫుడ్స్ , చక్కెర ఎక్కువగా ఉండే తీపి పానీయాలను అధికంగా ఇవ్వకూడదు. అలాగే మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు , టీవీల ముందు గంటల తరబడి ఎక్కువ సమయం గడపనివ్వద్దు. శారీరక శ్రమ లేకుండా రోజంతా ఒకేచోట కూర్చోవడం , రాత్రిళ్లు ఎక్కువ సమయం మేల్కొని ఉండటం (అర్ధరాత్రి జాగరణ) వంటి అలవాట్లు పిల్లల ఎత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
పిల్లల ఎత్తు , సరైన శారీరక అభివృద్ధికి సమతుల్య ఆహారం, మంచి జీవనశైలి , అవసరమైన పోషకాలు చాలా ముఖ్యం. మీ పిల్లల పెరుగుదల గురించి మీకు ఇంకా ఏవైనా ఆందోళనలు ఉంటే, సొంత వైద్యం చేయకుండా ఒకసారి నిపుణులైన వైద్యుడిని సంప్రదించి సరైన సలహా తీసుకోవడం ఉత్తమం.
