Frog Control Tips : వేసవి ముగిసి వర్షాకాలం సమీపిస్తుండటంతో గాలిలో తేమ పెరిగి, వాతావరణం నెమ్మదిగా చల్లబడుతుంది. ఇటువంటి పరిస్థితులలో చీమలు, బొద్దింకలు, దోమలు వంటి కీటకాలతో పాటు కప్పలు కూడా వెచ్చని ఆశ్రయం కోసం మన ఇళ్లలోకి రావడం సర్వసాధారణం. కప్పలు ఎక్కువగా తేమ ఉండే పూల మడులు, నీటి ట్యాంకులు, బాత్రూమ్‌ల వంటి ప్రదేశాలలో నివసించడానికి ఇష్టపడతాయి. అయితే, కప్పల చర్మం చాలా సున్నితంగా ఉండటం వల్ల కొన్ని సహజ సిద్ధమైన వంటగది పదార్థాల ఘాటైన వాసనలతో వాటిని సులభంగా ఇళ్ల నుంచి దూరంగా ఉంచవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఉప్పు నీటితో క్లీనింగ్
కప్పలను తరిమికొట్టడానికి ఉప్పు అద్భుతంగా పనిచేస్తుంది. ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు కలిపి, ఆ నీటితో ఇంటి నేలను తుడవాలి. అలాగే నీటి ట్యాంకుల చుట్టూ, తోట పరిసరాల్లో ఉప్పును చల్లడం వల్ల కప్పలు రావు. అయితే, ఉప్పులోని లవణ గుణం మొక్కలకు, మట్టికి హాని కలిగిస్తుంది కాబట్టి పూల మొక్కల మొదళ్లలో నేరుగా ఉప్పును చల్లకూడదు.
కాఫీ పొడి ద్రావణం
ఇంటి పరిసరాల్లో కప్పలు చేరకుండా చేయడంలో కాఫీ పొడి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొద్దిగా గోరువెచ్చని నీటిలో కాఫీ పొడిని కలిపి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి తోటలోని గడ్డి, మొక్కలపై పిచికారీ చేయడం వల్ల కప్పలను ఆకర్షించే కీటకాలు దూరమవుతాయి. ఫలితంగా ఆహారం దొరక్క కప్పలు కూడా ఆ ప్రాంతానికి రావు.
నిమ్మరసం , వెనిగర్ మిశ్రమం
అర కప్పు వెనిగర్‌ను మూడు నుంచి నాలుగు గ్లాసుల నీటిలో కలిపి, అందులో రెండు నిమ్మకాయల రసాన్ని కూడా జోడించాలి. ఈ ఆమ్ల మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి ఇల్లు, బాత్రూమ్, నీటి వనరుల వద్ద చల్లుకోవాలి. ప్రముఖ వెబ్‌సైట్ ‘మాస్టర్‌క్లాస్’ (masterclass.com) పంచుకున్న సమాచారం ప్రకారం.. వెనిగర్‌లో ఆమ్ల గుణం ఎక్కువగా ఉండటం వల్ల ఈ మిశ్రమాన్ని నేరుగా మొక్కలపై లేదా మట్టిపై చల్లకూడదు. అలా చేస్తే వృక్షసంపద దెబ్బతినే లేదా మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది.
బ్లీచింగ్ పౌడర్ జాగ్రత్తలు
కప్పలను ఇంటి నుండి తరిమేయడానికి బ్లీచింగ్ పౌడర్ ద్రావణాన్ని కూడా వాడుకోవచ్చు. ఒక మగ్గు నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలిపి, ఇల్లు, తోట, బాత్రూమ్ , నీటి ట్యాంకుల చుట్టూ స్ప్రే చేయాలి. అయితే బ్లీచింగ్ పౌడర్‌లో రసాయన మూలకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, దీనిని మొక్కలపై నేరుగా వాడకూడదు. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో ఈ ద్రావణాన్ని ఉపయోగించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం అవసరం.
ఇంటి పరిసరాల పరిశుభ్రత
కప్పలు సురక్షితమైన ఆశ్రయం కోసం, ఆహారం కోసం పొడవైన గడ్డిని, పొదలను వెతుక్కుంటాయి. అందువల్ల ఇంటి చుట్టూ ఉన్న గడ్డిని క్రమం తప్పకుండా కత్తిరిస్తూ, వాకిలిని శుభ్రంగా ఉంచుకోవాలి. కీటకాలు చేరనివ్వకుండా జాగ్రత్తపడితే, కప్పలకు అనువైన వాతావరణం లభించదు. దీంతో అవి సహజంగానే మన ఇళ్లకు దూరంగా ఉంటాయి.
