NTV Telugu Site icon

Rare Love Marriage: అరుదైన ప్రేమ పెళ్లి. ఆన్ లైన్ వివాహానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

Rare Love Marriage

Rare Love Marriage

Rare Love Marriage: పెళ్లిళ్లు పలు రకాలు. ఈమధ్య వింత వివాహమొకటి జరిగింది. ఓ అమ్మాయి తననుతానే మనువాడింది. సోలో బతుకే సో బెటర్‌ అన్నట్లు ఈ సోలో మ్యారేజ్‌ అప్పట్లో బాగా వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు ఓ అరుదైన పెళ్లికి తెర లేవబోతోంది. ఇది ఆన్‌లైన్‌ మ్యారేజ్‌. అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. అమ్మాయి ఇండియాలో ఉంది. వాళ్లిద్దరూ వర్చువల్‌గా ఒక్కటవుతారన్నమాట. దీనికి మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సబ్‌ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. తద్వారా ఆ జంటకు పరోక్షంగా ప్రి-వెడ్డింగ్‌ గిఫ్ట్‌ ఇచ్చింది.

తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన వంశీ సుదర్శిని అనే అమ్మాయి, అమెరికాకు చెందిన రాహుల్‌ ఎల్‌ మధు అనే అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం అతను అమెరికా నుంచి ఇండియాకి వచ్చాడు. తామిద్దరం వివాహం చేసుకోవాలనుకుంటున్నాం అంటూ ఈ ఏడాది మే 5వ తేదీన మనవలకురిచి అనే ప్రాంతంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఉమ్మడిగా దరఖాస్తు సమర్పించారు. ప్రత్యేక వివాహ చట్టం-1954లోని సెక్షన్‌-5(వివాహ ఉద్దేశ ముందస్తు సమాచారం) మేరకు అప్లికేషన్‌ ఇచ్చారు. వారం రోజుల తర్వాత దీనికి సంబంధించిన నోటీసునూ ప్రచురించారు.

President’s flag: ప్రెసిడెంట్స్ ఫ్లాగ్ అంటే ఏంటి?. రేపు తమిళనాడు పోలీసులకు ఇవ్వనున్న వెంకయ్యనాయుడు

తద్వారా తాము భార్యాభర్తలం కాబోతున్నామని బహిరంగంగా ప్రకటించారు. నిబంధనల ప్రకారం నెల రోజులాగి చట్టబద్ధంగా ఒక్కటయ్యేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకి వెళ్లారు. కానీ అధికారి ఆ పెళ్లి జరపలేదు. ఎందుకు? ఏమిటి? అనేది తెలియదు. దీంతో వాళ్లు నిరాశగా వెనుదిరిగారు. పెళ్లి నిమిత్తం ఇండియాలో ఉండేందుకు తీసుకున్న అనుమతి గడువు ముగుస్తుండటంతో అతను తిరిగి అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అమ్మాయి హైకోర్టులో పిటిషన్‌ వేసింది. వర్చువల్‌ మ్యారేజ్‌కి పర్మిషన్‌ ఇవ్వాలని కోరింది.  ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ చేసిన తప్పిదానికి ఆ జంట శిక్ష అనుభవించకూడదని అన్నారు. పెళ్లి అనేది మనిషి ప్రాథమిక హక్కు అని, ప్రత్యేక విహహ చట్టం, పౌర-రాజకీయ హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన దీనికి అనుకూలంగా విధివిధానాలను రూపొందించాయని చెప్పారు. పెళ్లి ఎలా చేసుకోవాలనేది వ్యక్తుల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని, ఈ కేసులో వీళ్లిద్దరూ ఆన్‌లైన్‌ పద్ధతిని ఎంచుకున్నారని, టెక్నాలజీకి అనుగుణంగా చట్టం కూడా మారాలని తెలిపారు.

పిటిషనర్‌ కోరినట్లు వర్చువల్‌గా పెళ్లి చేసేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వరుడు రాహుల్‌కి వధువు వంశీ పవరాఫ్‌ అటార్నీ కాబట్టి ఆమె అతని తరఫున మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ బుక్‌లో సంతకం చేయొచ్చని స్పష్టం చేశారు. ముగ్గురు సాక్షుల సమక్షంలో చట్టం ప్రకారం పెళ్లి జరిపించి ఆమెకు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. పెళ్లి కార్డు లేని ఈ ప్రేమ వివాహానికి మొత్తమ్మీద శుభం కార్డు పడింది.