Rare Diabetes In Babies: ఇటీవల కాలంలో డయాబెటిస్ కేసులు కేవలం వృద్ధులు, నడివయస్సు వాళ్లకు మాత్రమే పరిమితం కాలేదు.. ఈ సమస్య ఇప్పుడు చిన్నారులను కూడా వేధిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. తాజాగా ఇంగ్లాండ్‌లోని శాస్త్రవేత్తలు ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారుల్లో మాత్రమే కనిపించే కొత్త, అరుదైన మధుమేహాన్ని గుర్తించారు. అసలు ఈ సమస్యలు చిన్నారుల్లో ఎందుకు వస్తుంది, డయాబెటిస్ సమస్యను చిన్నారుల్లో ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..
ఈ డయాబెటిస్ వ్యాధి TMEM167A జన్యువులోని మ్యుటేషన్ వల్ల వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది టైప్ 1, 2 , 3 లకు భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. టైప్ 1 డయాబెటిస్‌లో శరీర రోగనిరోధక వ్యవస్థ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్‌లో శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోదు. టైప్ 3 డయాబెటిస్ అనేది మెదడు అభివృద్ధికి సంబంధించిన అరుదైన వ్యాధి. దీనికి విరుద్ధంగా TMEM167A మ్యుటేషన్ వల్ల కలిగే డయాబెటిస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పనిచేయక పోవడానికి కారణమవుతుందని తెలిపారు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
దీంతో ఏం జరుగుతుంది..
చిన్నారుల్లో TMEM167A మ్యుటేషన్ వల్ల వచ్చే మధుమేహం కారణంగా దాహం పెరగడం, బరువు తగ్గడం, అలసట, రక్తంలో చక్కెర పెరగడం వంటి సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు ఈ వ్యాధి బారిన పడిన పిల్లల్లో మైక్రోసెఫాలీ, మెదడు అభివృద్ధి రుగ్మత (సాధారణ తల పరిమాణం కంటే చిన్నది), మూర్ఛ వంటి నాడీ సంబంధిత సమస్యలు రావచ్చని అంటున్నారు. ఈ పరిస్థితి జీవితాంతం ఉండటం లేదా కొన్ని నెలల తర్వాత తగ్గిపోతుందని చెబుతున్నారు. కానీ ఈ సమస్య తగ్గిపోయినా.. కొన్ని సందర్భాల్లో పునరావృతమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధికి ప్రస్తుతం శాశ్వత నివారణ లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కానీ ఇన్సులిన్ థెరపీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని, జన్యు పరీక్ష, మూల కణ నమూనాలను ఉపయోగించి ఈ వ్యాధిని నిర్ధారించవచ్చని చెప్పారు.
