Office Friends: వర్క్ ఫ్రం హోమ్ కంటే ఆఫీస్‌లో పని చేస్తేనే మంచి ఫీల్ ఉంటుంది.. సహోద్యోగులతో సమయం గడుపుతూ ఎంచక్కా పని చేసుకోవచ్చని చాలా మంది ఉద్యోగులు అభిప్రయపడుతున్నారని ఓ సర్వే వెల్లడించింది. కొన్ని సార్లు ఆఫీస్ స్నేహాలు, నిజ జీవిత సంబంధాలు ఒకటే అని చాలా మంది భావిస్తుంటారట. కానీ.. ఓ యువతి విషయంలో మాత్రం భిన్నంగా మారింది. పెళ్లి జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. ఆ రోజున ఆఫీస్ వాళ్ల నుంచి ఆత్మీయత, తోడుండాలన్న ఆశ సహజంగానే ఉంటుంది. కానీ అదే ఆఫీస్ ఉద్యోగులు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ ఒక్క ఘటనతో ఆమె మానసికంగా కుంగదీసింది. దీంతో చివరికి ఉద్యోగం వదిలేసింది.
చైనాకు చెందిన ఓ యువతి గత ఐదేళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తోంది. ఆఫీస్‌లో తనతో పని చేసే వాళ్లంతా తనకు చాలా దగ్గర వాళ్లే అని, వాళ్లతో మంచి బంధం ఉందని ఆమె నమ్మింది. రోజూ కలిసి పని చేయడం, జోకులు వేసుకుని సరదాగా నవ్వుకోవడం, సమస్యలు పంచుకోవడం ఇవన్నీ చూసి “ఇవాళ కాకపోయినా రేపు వీళ్లంతా నా వాళ్లే” అని అనుకుంది. ఇంతలో ఆ యువతికి పెళ్లి నిశ్చయమైంది. మొదట ఆఫీస్‌లోని కొద్దిమంది సన్నిహిత స్నేహితులనే పిలవాలనుకుంది. కొందరిని పిలిచి, కొందరిని పిలవకపోతే ఆఫీస్‌లో అపార్థాలు వస్తాయేమోఅన్న భయంతో తన డిపార్ట్‌మెంట్‌లో ఉన్న దాదాపు 70 మందిని పెళ్లికి ఆహ్వానించాలని.
READ MORE: Hyderabad: ప్రైవేట్ స్కూల్‌లో.. ఇంటర్వ్యూ కి పిలిచి యువతిపై లైంగిక వేధింపులు..
పెళ్లికి రెండు నెలల ముందే అందరికీ ఇన్విటేషన్ పంపింది. అంతే కాదు, పెళ్లికి ముందు ఆఫీస్‌లోని చాలామందికి చిన్న చిన్న బహుమతులు కూడా ఇచ్చింది. తన పెళ్లి ఆనందాన్ని వాళ్లతో పంచుకోవాలనుకుంది. వాళ్లు వస్తారు, ఆశీర్వదిస్తారు, తన సంతోషంలో భాగం అవుతారు అన్న నమ్మకం ఆమెకు ఉంది. కానీ పెళ్లి రోజు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 70 మంది ఆఫీస్ సహచరుల్లో ఒక్కరే వచ్చారు. హాజరైన యువకుడు ఆమె కంటే జూనియర్. బాధ్యతగా వచ్చాడేమో తప్ప, ఆత్మీయతతో వచ్చాడన్న భావన ఓ యువతికి కలగలేదు. ఆఫీస్ వాళ్ల కోసం హోటల్‌లో ఆరు పెద్ద టేబుళ్లు బుక్ చేసింది. కానీ అవన్నీ ఖాళీగానే ఉండిపోయాయి. ఎంతో ఆహారం వృథా అయింది. తన కుటుంబ సభ్యుల ముందు, అత్తమామల ముందు సిగ్గుతో తలదించుకుంది. “నీ ఆఫీస్ వాళ్లెవ్వరూ రాలేదా?” అన్న ప్రశ్నలు ఆమెను లోపల నుంచే కుదిపేశాయి.
ఐదేళ్లు కలిసి పని చేసిన వాళ్లు, రోజూ పలకరించిన వాళ్లు, నవ్విన వాళ్లు.. ఒక్క రోజుకైనా తన భావాలను అర్థం చేసుకోలేకపోయారని బాధపడింది. ఆ బాధ నుంచి ఆమె బయట పడలేకపోయింది. ఆ రాత్రి ఆమెకు నిద్ర కూడా రాలేదు. మరుసటి రోజు ఆఫీస్‌కు వెళ్లింది. ఎవ్వరితోనూ ఈ విషయం గురించి ప్రస్తావించలేదు. నిశ్శబ్దంగా తన రాజీనామా పత్రం మేనేజర్‌కు ఇచ్చేసింది. ఈ కథనం ప్రస్తుతం కథ సోషల్ మీడియాలో చాలామందిని ఆలోచనలో పడేస్తోంది. ఆఫీస్‌లో ఏర్పడే బంధాలు నిజమైన స్నేహాలా? వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన సందర్భాల్లో ఆఫీస్ వాళ్ల నుంచి అంత ఆశ పెట్టుకోవడం సరైందేనా? ఆఫీస్ కేవలం పని వరకేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
