Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు

  • తేమ తగలకుండా నిల్వ చేయాలి
  • గాలి చొరబడని డబ్బాలే మంచివి
  • వేడి, సూర్యరశ్మికి దూరంగా ఉంచాలి
  • పురుగుల బెడదకు ఫ్రీజర్ చిట్కా
Mustard Seeds Storage

Mustard Seeds Storage

భారతీయ వంటకాల్లో ఆవాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పోపు పెట్టడం నుంచి పచ్చళ్లు, రకరకాల వంటకాల తయారీ వరకు ఆవాల వాడకం తప్పనిసరి. నూనెలో ఆవాలు చిటపటలాడుతుంటే వచ్చే సువాసనే వేరు. అయితే, ఈ చిన్న గింజలను సరిగ్గా నిల్వ చేయకపోతే వాటి ఘాటు, రుచి తగ్గిపోవడంతో పాటు తేమ కారణంగా బూజు పట్టడం లేదా పురుగులు పట్టి పాడైపోయే అవకాశం ఉంది. ఆవాలు ఎక్కువ కాలం తాజాగా, గుమగుమలాడే సువాసనతో ఉండేలా ఎలా నిల్వ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తేమ తగలకుండా జాగ్రత్త

ఆవాలను నిల్వ చేసేటప్పుడు గాలిలో తేమపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. తేమ ఎక్కువగా ఉంటే గింజలు అతుక్కుపోయి బూజు పట్టేస్తాయి. అందువల్ల ఆవాలను నిల్వ చేసే ముందు అవి పూర్తిగా పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దుమ్ము, ధూళి లేకుండా శుభ్రం చేసిన తర్వాతే వాటిని నిల్వ చేసే పాత్రలోకి మార్చుకోవాలి.

గాలి చొరబడని డబ్బాలు ఉత్తమం

ఆవాలను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి గాలి చొరబడని డబ్బాలు (Air-tight containers) అత్యంత అనుకూలం. దీనికోసం శుభ్రమైన గాజు సీసాలను లేదా మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ డబ్బాలను ఉపయోగించవచ్చు. డబ్బా మూత గట్టిగా బిగుసుకుని ఉండాలి. దీనివల్ల బయటి గాలి, తేమ లోపలికి వెళ్లకుండా ఉండి కీటకాల బెడద తప్పుతుంది. మీ వద్ద ఎక్కువ మొత్తంలో ఆవాలు ఉంటే పెద్ద గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోవచ్చు.

వేడి , సూర్యరశ్మికి దూరం ఉంచాలి

ఆవాలను ఎప్పుడూ చల్లని, పొడి ప్రదేశంలోనే నిల్వ చేయాలి. పొరపాటున కూడా గ్యాస్ స్టవ్‌లు, ఓవెన్‌లు లేదా ఇతర వేడి వనరుల దగ్గర వీటిని ఉంచకండి. నిరంతరం వేడికి గురికావడం వల్ల ఆవాలలో ఉండే సుగంధ తైలాలు ఆవిరైపోయి రుచి, సువాసన కోల్పోతాయి. అలాగే ప్రత్యక్ష సూర్యరశ్మి తగలకుండా చీకటిగా లేదా మసక వెలుతురు ఉండే కిచెన్ అల్మారాలు (ప్యాంట్రీ) ఎంచుకోవడం మంచిది.

తేలికగా వేయించి నిల్వ చేసే పద్ధతి

ఆవాలను మరింత కాలం పాడవకుండా ఉంచడానికి మరో సింపుల్ చిట్కా ఉంది. ఒక పొడి బాణలిలో ఆవాలను మీడియం మంటపై చిటపటలాడే వరకు దోరగా వేయించాలి. మంచి సువాసన రాగానే స్టవ్ ఆఫ్ చేసి, వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే చాలా కాలం పాటు తాజాాగా ఉంటాయి. అలాగే మీరు కొనుగోలు చేసిన తేదీని డబ్బాపై రాసుకుంటే ఏది పాతదో గుర్తుపెట్టుకుని ముందుగా వాడటానికి వీలవుతుంది.

పురుగుల బెడద ఉంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి

ఒకవేళ ఆవాలలో పురుగులు ఉన్నట్లు అనుమానం వస్తే, వాటిని గాలి చొరబడని ప్లాస్టిక్ సంచిలో వేసి కనీసం 4 రోజుల పాటు రిఫ్రిజిరేటర్‌లోని ఫ్రీజర్‌లో (-18°C వద్ద) ఉంచాలి. ఇలా చేయడం వల్ల అందులోని పురుగుల గుడ్లు నశిస్తాయి. అయితే కీటకాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటే మాత్రం వాటిని ఉపయోగించకపోవడమే మంచిది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంట్లోని ఆవాలు ఎప్పటికీ తాజాగా, ఘాటుగా ఉంటాయి..