Moringa Chapati: డైట్ చేస్తున్నారా.. రొటీన్ టిఫిన్లతో విసిగిపోయారా.. అయితే మీకోసం ఒక అదిరిపోయే హెల్తీ రెసిపీ సిద్ధంగా ఉంది. మునగాకుతో చేసే ఈ చపాతీలు రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. మునగాకులో ఉండే పోషక విలువల గురించి మనందరికీ తెలిసిందే. అయితే ప్రతిరోజూ పప్పులోనో, వేపుడులోనో కాకుండా ఇలా చపాతీ రూపంలో తీసుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అతి తక్కువ సమయంలో ఇంట్లోని పదార్థాలతోనే ఈ పోషక రొట్టెలను ఎలా సిద్ధం చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
READ ALSO: ఎలుక కరిస్తే.. లక్షణాలు ఇలా..! నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం?
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, తాజాగా తుంచిన మునగాకు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము, నూనె/నెయ్యి.
తయారీ విధానం: ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో గోధుమ పిండిని తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయాలి. దీనికి అదనపు రుచి కోసం అల్లం తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అరుగుదలకు సహాయపడే వామును జత చేయాలి. ఈ మిశ్రమంలో బాగా కడిగి పెట్టుకున్న తాజా మునగాకును వేసి, కొద్దిగా నూనె వేసి ముందుగా పొడిగానే బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకుని, ఒక పది నిమిషాల పాటు మూతపెట్టి పక్కన ఉంచాలి. నానిన పిండిని సమాన పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. పొడి పిండి చల్లుకుంటూ చపాతీల్లా పల్చగా ఒత్తుకోవాలి. వీటిని వేడిగా ఉన్న పెనం (తవా) మీద వేసి రెండు వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చాలి. రెండు వైపులా కాలిన తర్వాత కొద్దిగా నూనె లేదా నెయ్యి రాస్తే చపాతీలు మృదువుగా వస్తాయి. వేడి వేడి మునగాకు చపాతీలను ఏదైనా మీకు ఇష్టమైన పచ్చడితో లేదా రైతాతో కలిపి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. మధుమేహ బాధితులు, రక్తహీనతతో బాధపడేవారు ఈ చపాతీలను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
READ ALSO: Maruthi: చిరంజీవితో సినిమాపై డైరెక్టర్ మారుతి షాకింగ్ కామెంట్స్..
