Door Lock Care Tips: వానలకు మీ ఇంటి తాళాలు పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మెరిపించండి!

Lock Care Tips

Lock Care Tips

Door Lock Care Tips: వర్షాకాలం వచ్చిందంటే వాతావరణం చల్లబడటంతో పాటు ఇంట్లో పలు సమస్యలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా వాతావరణంలో ఉండే తేమ కారణంగా గోడలకు సీలింగ్‌ రావడం, బట్టలు సరిగ్గా ఆరకపోవడం వంటి ఇబ్బందులతో ఎదురౌతుంటాయి. అలాగే ఇంటి తలుపులకు ఉండే తాళాలకు తుప్పు పట్టడం, చైను సరిగ్గా తిరగకపోవడం, తాళం జామ్‌ కావడం వంటివి కూడా తరచూ ఎదురవుతుంటాయి. వర్షం నీరు, గాలిలో అధిక తేమ, తడిగా ఉన్న చేతులతో తాళాలు ఉపయోగించడం వల్ల వాటి లోపలి భాగాల్లోకి నీరు చేరుతుంది. దీంతో చిన్నచిన్న భాగాలు పాడై తాళం బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి తాళం పూర్తిగా జామ్‌ అయి దాన్ని పగలగొట్టాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అయితే కొన్ని సింపుల్‌ జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో తాళాలను సురక్షితంగా, ఎక్కువ కాలం పనిచేసేలా చూసుకోవచ్చు. అవి ఏంటో ఈ స్పె్షల్ స్టోరీలో తెలుసుకుందాం.

* తాళం కీహోల్‌లో సాధారణ నూనె లేదా గ్రీజ్‌ వేయడం మంచిది కాదు. వీటికి దుమ్ము, ధూళి అంటుకుని తాళం మరింత బిగుసుకుపోవచ్చు. అందుకు బదులుగా గ్రాఫైట్‌ పౌడర్‌ లేదా PTFE స్ప్రే వంటి డ్రై లూబ్రికెంట్‌ను ఉపయోగించవచ్చు. కొద్దిగా స్ప్రేను తాళం చెవికి అప్లై చేసి రెండు, మూడు సార్లు కీహోల్‌లో పెట్టి తిప్పితే లోపలి భాగాలు సులభంగా కదులుతాయి.

* కేవలం కీహోల్‌ను మాత్రమే శుభ్రంగా ఉంచడం సరిపోదు. తలుపు తాళంలోని కుదురు, బోల్ట్‌ వంటి భాగాలపై కూడా తేమ ప్రభావం చూపుతుంది. వీటికి తగిన సిలికాన్‌ స్ప్రే లేదా లూబ్రికెంట్‌ను తక్కువ మోతాదులో ఉపయోగించవచ్చు. అనంతరం హ్యాండిల్‌ను మూడు, నాలుగు సార్లు కదిలిస్తే లూబ్రికెంట్‌ లోపలి భాగాలకు చేరుతుంది.

* వర్షంలో తడిసి ఇంటికి వచ్చినప్పుడు తడిగా ఉన్న చైను వెంటనే తాళంలో పెట్టడం చాలామంది చేసే పొరపాటు. ఇలా చేయడం వల్ల తాళం లోపలికి నీరు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తాళం తెరిచే ముందు చైను పొడి కాటన్‌ వస్త్రంతో తుడవాలి. చైను తుప్పు పట్టినట్లు కనిపిస్తే దాన్ని మార్చడం మంచిది.

* తలుపు లేదా పైకప్పు నుంచి వర్షపు నీరు నేరుగా తాళంపై పడుతుంటే తుప్పు పట్టే అవకాశం పెరుగుతుంది. తలుపు పైన చిన్న షెడ్‌ ఏర్పాటు చేయడం లేదా వాటర్‌ప్రూఫ్‌ స్ట్రిప్‌ ఉపయోగించడం ద్వారా నీటి ప్రవాహాన్ని తాళానికి దూరంగా మళ్లించవచ్చు.

* తలుపుకు పైభాగంలో ఎలాంటి షెడ్‌ లేని ఇళ్లలో వర్షపు నీరు నేరుగా తాళాలపై పడుతుంది. ఇలాంటి తలుపులకు మార్కెట్‌లో లభించే చిన్న ప్లాస్టిక్‌ లేదా మెటల్‌ లాక్‌ కవర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి వర్షపు నీరు నేరుగా తాళంపై పడకుండా కొంతవరకు రక్షణ కల్పిస్తాయి.

* తాళంపై లేత గోధుమ లేదా నారింజ రంగు మచ్చలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. చాలా సున్నితమైన స్టీల్‌ వూల్‌ లేదా సాండ్‌పేపర్‌తో తుప్పును మెల్లగా తొలగించి, అనంతరం తగిన ప్రొటెక్టివ్‌ కోటింగ్‌ లేదా లూబ్రికెంట్‌ను స్వల్పంగా అప్లై చేయవచ్చు.

ఈ మూడు పొరపాట్లు మాత్రం చేయొద్దు

* ఆవ నూనె, కొబ్బరి నూనె లేదా వంటకు ఉపయోగించే ఇతర నూనెలను తాళంలో తరచుగా వేయడం మంచిది కాదు. ఇవి కాలక్రమంలో జిగటగా మారి దుమ్మును ఆకర్షించి తాళాన్ని మరింత జామ్‌ చేయవచ్చు.

* ఎక్కువగా స్ప్రే చేయడం వల్ల తాళం మరింత బాగా పనిచేస్తుందని అనుకోవడం పొరపాటు. అవసరానికి మించి లూబ్రికెంట్‌ ఉపయోగిస్తే దుమ్ము, మురికి పేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ మోతాదులోనే ఉపయోగించాలి.

* తాళం సరిగ్గా పనిచేయకపోతే చైను మీద బలంగా ఒత్తిడి చేయడం ప్రమాదకరం. అలా చేస్తే చైను లోపలే విరిగిపోవచ్చు లేదా వంకర కావచ్చు. ముందుగా తాళాన్ని శుభ్రం చేసి, తగిన లూబ్రికెంట్‌ వేసి మెల్లగా ప్రయత్నించాలి. అయినా తాళం తెరుచుకోకపోతే తాళాలు బాగుచేసే నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.