NTV Telugu Site icon

Mutton Paya Soup Recipe: మటన్ పాయా సూప్ తయారీ విధానం.. దీంతో ఎన్ని లాభాలంటే?

Mutton Paya Soup

Mutton Paya Soup

చలికాలం ప్రారంభమైంది. రోజు రోజుకూ ఊష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అయితే ఈ చలిలో మనకు కారం.. కారంగా, వేడివేడిగా ఏదైనా తినాలని అనిపిస్తుంది. చాలా మంది ప్రజలు తరచుగా జంక్ ఫుడ్‌ను తింటుంటారు. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారం కంటే.. శరీరానికి ఉపయోగపడే రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెసిపీ తెలంగాణా వాసులు, ముఖ్యంగా హైదరాబాదీలకు సుపరిచితమే. ఇంతకీ ఏంటి ఈ వంటకం అని అనుకుంటున్నారా? అదే నండి.. వింటర్ స్పెషల్ మటన్ పాయా సూప్. మినరల్స్, విటమిన్లు సమృద్ధిగా ఉన్న పాయా సూప్ శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. జలుబు, స్థూలకాయాన్ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. పాయ సూప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు..
మేక కాళ్లు 150-200 గ్రా (5-6 పీసులు)
రుచికి తగినట్లుగా ఉప్పు, నల్ల మిరియాల పొడి
నీరు- 500-650 మి.లీ
కొత్తిమీర కాండం, ఆకులు – 2 టేబుల్ స్పూన్లు
కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె – 1 టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 కప్పు
తరిగిన వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క – 1
జాపత్రి – 1
లవంగాలు – 2
బిరియాని ఆకులు – 2
పచ్చి ఏలకులు – 2
అల్లం – ½ అంగుళం

రెసిపీ తయారీ విధానం..
ప్రెజర్ కుక్కర్‌లో నూనె వేడి చేయండి. పైన పేర్కొన్న మసాలా దినుసులను అందులో వేయండి. అనంతరం తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం వేసి వేయించండి. తర్వాత లాంబ్ ట్రోటర్స్(మేక కాళ్లు) వేసి తక్కువ వేడి మీద వేయించండి. ఆ తర్వాత ఉప్పు, మిరియాలు, నీరు వేసి బాగా మిక్స్ చేయండి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. స్ట్రైనర్‌తో కంటెంట్‌లను వడకట్టండి. సర్వింగ్ బౌల్‌లో సూప్‌ను పోసి, తాజా నిమ్మరసం పిండుకుని తాగేయడమే.. అంతే కాకుండా ఈ మటన్ పాయాలో మీకు నచ్చిన కూరగాయల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

పాయా సూప్‌ వల్ల ఎన్ని లాభాలో..
పాయా సూప్‌లో మినరల్స్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఫ్లోరైడ్, పొటాషియం వంటి మంచి పోషకాలు ఉంటాయి. దీని వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఈ సూప్‌లో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. జిలాటిన్ ఉండటం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. నిత్యం కొంత మోతాదులో పాయ సూప్ తీసుకుంటే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. పాయ సూప్ తాగడం వల్ల శరీరంలో వాపు తగ్గుతుంది. ఇందులో ఉండే ఎల్-గ్లుటామైన్ పేగు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. పాయా సూప్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది జలుబు లక్షణాలను తగ్గిస్తుంది.

 

Show comments