Site icon NTV Telugu

Marriage:పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుంది.. ఇదిగో సాక్షం..

Dia Mirza Wedding Decor Photos

Dia Mirza Wedding Decor Photos

మన ఫ్రెండ్స్ కి పెళ్లి ఫిక్స్ అయితే చాలు .. అయిపాయె… నీ జీవితం అయిపోయిందిరా.. ఇక రోజంతా నీకు నరకమే అంటూ ఎన్నెన్నో మాటలు చెప్తాము.. కానీ వాస్తవానికి వైవాహిక బంధం వ్యక్తుల ఆయుష్షుపై ప్రభావం చూపిస్తుందని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం తాలూకు వివరాలు జామా నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం పెళ్లి కాని వారితో పోలిస్తే వివాహితులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. అవివాహితులు వివిధ కారణాల వల్ల పెళ్లి అయిన వారితో పోలిస్తే త్వరగా మరణించే అవకాశం 15 శాతం ఎక్కువ. అంతేకాదు పెళ్లి అయిన వారు ప్రమాదాలు, గాయాలు జరిగినప్పుడు, గుండె జబ్బుల వల్ల మరణించే అవకాశం 20 శాతం తక్కువగా ఉంటుంది. ఈ అధ్యయనాన్ని బట్టి పెళ్లి చేసుకోవడం వల్ల దీర్ఘాయువు కలుగుతుందని అర్థమవుతోంది.

కారణాలు:

వివాహితుల్లో దీర్ఘాయువు కలగడానికి కారణం ఎన్నో ఉంటాయని చెబుతోంది అధ్యయనం. ఒకరికి ఒకరు తోడుండడం వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని, ధైర్యాన్ని కలిగిస్తుందని, అలాగే అనారోగ్య పరిస్థితుల్లో కూడా వారికి అండగా బంధం నిలుస్తుందని… ఇలాంటి కారణాల వల్ల వివాహితులు పెళ్లి కాని వారితో పోలిస్తే మరింత ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనం తేల్చింది.అంతేకాదు భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్థులు అయినప్పుడు, ఒకరి నుంచి ఒకరికి ఆర్ధిక సాయం అందుతుంది. దీని వల్ల ఆర్ధిక ఒత్తిళ్లు తక్కువగా ఉంటాయి. మంచి ఆర్ధిక పరిస్థితులు, ఆరోగ్యకరమైన జీవనశైలి వివాహం వల్ల కలుగుతుందని జపాన్ నేషనల్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు తెలిపారు.

వివాహం కాని మగవారు అధికంగా చెడు అలవాట్లకు గురవుతారని, మధ్యపానం, ధూమపానం, అనారోగ్యకరమైన ఆహారం వల్ల ప్రమాదకరమైన సమస్య బారిన పడతారని చెబుతున్నారు. అదే ఒంటరి ఆడవారు ఒంటరితనాన్ని భరించలేక మానసిక ఆందోళనకు గురవుతారని తెలిపారు.

అధ్యయనం ప్రకారం:

అధ్యయనం కోసం పరిశోధకులు 54 ఏళ్ల వయసున్న 6,23,140 వ్యక్తుల డేటాను పరిశీలించారు. వారి వైవాహిక స్థితిని బట్టి ఆరోగ్యాన్ని అంచనా వేశారు. వారిలో అత్యధికులు 86.4 శాతం మంది వివాహం చేసుకున్నవారు. మిగతా వారంతా ఒంటరి వారే. వారిలో విడాకులు తీసుకున్నవారు, వితంతువులు కూడా ఉన్నారు. పదిహేను సంవత్సరాల పాటూ సాగిన ఈ అధ్యయనంలో మొత్తం 1,23,264 మంది మరణించారు. వీరిలో 41,362 మంది క్యాన్సర్, 14,563 మంది సెరెబ్రోవాస్కులర్ వ్యాధులు, 13,583 మంది శ్వాసకోశ వ్యాధులు కారణంగా మరణించినట్టు గుర్తించారు.

Exit mobile version