NTV Telugu Site icon

Lucky Family: అదృష్ట కుటుంబమంటే ఇదే.. అప్పులతో కాసేపట్లో ఇల్లు అమ్మాల్సిన స్థితిలో..

Lucky Family

Lucky Family

Lucky Family: అదృష్టమంటే ఇదే. ‘దేవుడున్నాడు’ అనే సెంటిమెంట్‌ డైలాగ్‌ అందరి నోటా ఆటోమేటిగ్గా వచ్చే సందర్భం. ఓ కుటుంబం అప్పుల బాధ పడలేక ఉన్న ఇంటిని ఉన్నపళంగా అమ్ముకొని అద్దె ఇంట్లోకి మారాల్సిన పరిస్థితి. బేరం కూడా కుదిరింది. బేరగాడు సాయంత్రం వచ్చి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఎనిమిది నెలల కిందటే ఆ ఇంటిని ఎన్నో ఆశలతో కట్టుకున్నారు. బ్యాంకు నుంచి రూ.10 లక్షలు, బంధువుల నుంచి రూ.20 లక్షలు తీసుకొని సొంతింటి కలను సాకారం చేసుకున్నారు. కానీ ఆ ఫ్యామిలీకి సంపాదన తక్కువ. నాలుగు నెలల నుంచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

ఆ కుటుంబంలో నలుగురు ఆడపిల్లలు, ఒక మగపిల్లగాడు ఉన్నారు. ఇద్దరమ్మాయిల పెళ్లిళ్లు చేశారు. మరో ఇద్దరు అమ్మాయిలు ఇంటర్‌ చదువుతున్నారు. కొడుకు ఈమధ్యే ఖతార్‌లో చిన్న ఉద్యోగంలో చేరాడు. రోజువారీగా ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. చేసేదేమీ లేక దేవుడి మీద భారం వేశాడు. అమ్ముకోవటానికి వేరే ఆస్తులు కూడా ఏమీలేవు. దీంతో అదృష్టాన్నే నమ్ముకున్నారు. నాలుగు నెలల నుంచి క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొంటున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఆ లాటరీ తమకు తగలకపోతుందా, అప్పుల నుంచి బయటపడకపోతామా అనే ఆశావహ దృక్పథంతో ఉన్నారు.

read also: Interesting News: హైవే పక్కన హైఫై టాయిలెట్‌ కట్టించటం కోసం.. ఉద్యోగానికి సైతం గుడ్‌బై..

కానీ మూడు నెలల నుంచి నిరాశే ఎదురవుతోంది. వేరే గత్యంతరంలేక ఇక ఇల్లు అమ్మేద్దామని నిర్ణయానికొచ్చారు. వాళ్లు తీర్చాల్చిన మొత్తం అప్పు రూ.45 లక్షలు. కానీ ఇంటిని రూ.40 లక్షలకే అడుగుతున్నారు. బేరం కుదరట్లేదని కొద్ది రోజులు ఆగారు. కానీ అప్పులవాళ్లు ఆగట్లేదు. డబ్బులు ఇవ్వాలంటూ పదే పదే అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎంతో కొంతకి ఇల్లు అమ్మేద్దామనుకొని చివరిసారిగా బేరం కుదుర్చుకున్నారు. ఇల్లు కొనే వ్యక్తి ఆ రోజు సాయంత్రం వచ్చి డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఇంటి యజమాని మధ్యాహ్నం బయటికి వెళ్లి మరోసారి ఫిఫ్టీ-ఫిఫ్టీ లాటరీ టికెట్లు కొన్నాడు. మళ్లీ అదే ఆశ.

లాటరీ తగలకపోతుందా? డబ్బు రాకపోతుందా? అని ఎదురుచూశాడు. మూడు గంటలకు ఫోన్‌ వచ్చింది. మీకు లాటరీ తగిలిందని చెప్పారు. ఆ లాటరీ విలువ ఏకంగా కోటి రూపాయలు కావటం విశేషం. ట్యాక్స్‌లన్నీ పోను రూ.63 లక్షల వరకు వచ్చాయి. మొత్తానికి ఇంటిని నిలబెట్టుకున్నాడు. గంటల వ్యవధిలో జీవితం అనూహ్య మలుపు తిరగటాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. ఈ సంఘటన కేరళలో లేటెస్టుగా జరిగింది. కాసరగడ్‌ జిల్లాలోని మంజేశ్వర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ బవా అనే ఓ పెయింటర్‌ రియల్‌ స్టోరీ ఇది. రీల్‌ స్టోరీలా అనిపిస్తోంది.