Site icon NTV Telugu

Covid 19: కోలుకున్నా వేధిస్తున్న సమస్యలెన్నో!

అంతా అయిపోయింది. మనం ఇక సేఫ్ అనుకోవడానికి అవకాశం లేదు. ప్రపంచాన్ని వణికించిన కరోనా…అదుపులోనే ఉందా? అంటే ఇంకా లేదనే చెప్పాలి. కొవిడ్‌ సృష్టించిన విలయం నుంచి దేశాలు కోలుకోలేకపోతున్నాయి. వైరస్‌ సోకిన వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సమస్యలు వస్తున్నాయని నిపుణుల అధ్యయనాల్లో తేలింది. చైనాలో కోవిడ్ కేసులు 50 వేలకు పైగా నమోదవడం మరో మృత్యుఘంటికలు మోగిస్తోంది.

యావత్‌ ప్రపంచాన్ని కరోనా వైరస్‌ మహమ్మారి వణికించింది. ప్రస్తుతం కేసులు అదుపులోనే ఉన్నప్పటికీ… అది సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కొవిడ్‌ సోకిన బాధితులు త్వరగానే కోలుకుంటున్నప్పటికీ…మరికొందరిలో సుదీర్ఘకాలం పాటు కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. లాంగ్‌ కోవిడ్‌గా పరిగణించే కేసుల్లో.. బాధితులను రెండు లక్షణాలు ప్రధానంగా వేధిస్తున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా లాంగ్‌ కోవిడ్‌తో బాధపడుతున్న వారిలో జ్ఞాపకశక్తి సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం వంటివి బయటపడుతున్నాయ్.

అలాగే కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో పలు లక్షణాలు తీవ్రంగా వేధిస్తున్నాయి. జుట్టు రాలిపోవడం, అలసట, శ్వాసకోశ ఇబ్బందులు దీర్ఘకాల కొవిడ్‌ లక్షణాల జాబితాలోకి చేరాయ్. ఇదే సమయంలో లాంగ్‌ కొవిడ్‌ మరిన్ని ప్రభావాలను తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ పరిశోధకులు మరో అధ్యయనం చేపట్టారు. లాంగ్‌ కొవిడ్‌ బాధితుల్లో ఎక్కువగా జ్ఞాపకశక్తి లేకపోవడంతో పాటు ఏకాగ్రత సమస్యలు వెంటాడుతున్నట్లు తేలింది. ప్రతి పది మంది బాధితుల్లో ఏడుగురు న్యూరలాజికల్‌ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు కనుగొన్నారు. ఈ లక్షణాలు శాశ్వతంగా లేదా ఏడాది వరకూ ఉంటున్నట్లు కేంబ్రిడ్జ్‌ నిపుణులు వెల్లడించారు.

కొవిడ్‌ బాధితులను నెలలపాటు కొన్ని లక్షణాలు వేధిస్తున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇన్‌ఫెక్షన్‌ సోకిన తర్వాత 6 నుంచి 12 నెలల వరకు కొవిడ్‌ లక్షణాలు కనిపించినట్లు అధ్యయనంలో తేలింది. కీళ్ల నొప్పులు, ఛాతి నొప్పి, దగ్గు, నిద్రలేమి, ఆత్రుత, ఒళ్లు జలదరించటం వంటి బయటపడుతున్నాయ్. ఇలా కొవిడ్‌ కారణంగా పలు ఆరోగ్య సమస్యలు సుదీర్ఘ కాలంపాటు వేధిస్తున్నట్లు అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Exit mobile version