Quick Snacks: చాలా ఇళ్లలో రాత్రిపూట చేసిన చపాతీలు రెండు, మూడు మిగిలిపోవడం సహజం. మరుసటి రోజు ఉదయానికి అవి చల్లారిపోయి, గట్టిపడటంతో తినడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరు. దీంతో వాటిని పారేయడమో లేదా పక్కన పెట్టేయడమో చేస్తుంటారు. కానీ, ఇంట్లో ఉండే సాధారణ పోపు దినుసులతో, నయా పైసా అదనపు ఖర్చు లేకుండా ఆ చపాతీలతోనే అదిరిపోయే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయవచ్చు. అదే గుజరాతీ స్పెషల్ ‘వాఘరేలి రోట్లీ’.. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ‘చపాతీ పోహా’. కారం, ఉప్పు, కరివేపాకు సువాసనలతో.. బయట కరకరలాడుతూ, లోపల అదిరిపోయే మసాలాలతో సిద్ధమయ్యే ఈ స్నాక్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. ఉదయం అల్పాహారంలోకే కాకుండా, సాయంత్రం వేడివేడి టీతో స్నాక్లా తీసుకున్నా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి దీనిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
* మిగిలిన చపాతీలు: 2 కప్పులు (చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
* ఆవాలు: 1/4 చెంచా
* జీలకర్ర: 1/4 చెంచా
* కరివేపాకు: ఒక రెమ్మ
* ఎర్ర కారం: 1/2 చెంచా
* పసుపు: 1/4 చెంచా
* ఇంగువ: చిటికెడు (1/4 చెంచా)
* నూనె: 1 చెంచా
* ఉప్పు: తగినంత
తయారీ విధానం:
ముందుగా మిగిలిపోయిన చపాతీలను చేత్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాండీలో ఒక్క స్పూన్ నూనె వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఆ వెంటనే కరివేపాకు, పసుపు, కారం, చిటికెడు ఇంగువ వేసి కొన్ని సెకన్ల పాటు తాలింపును వేయించండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలను కడాయిలో వేసి, మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలపండి. మంటను సిమ్లో ఉంచి, చపాతీ ముక్కలు కాస్త కరకరలాడేంత వరకు మధ్యమధ్యలో కలుపుతూ 2-3 నిమిషాలు వేయించండి. చివరగా రుచికి సరిపడా ఉప్పు చల్లి మరోసారి కలపండి. రొట్టె ముక్కలు చక్కగా క్రిస్పీగా మారిన తర్వాత స్టవ్ ఆపేయండి. దీని రుచిని మరింత పెంచాలనుకుంటే.. ప్లేట్లోకి తీసుకున్నాక పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కాస్త కొత్తిమీర, కారప్పూస (సేవ్) చల్లుకుంటే అదిరిపోతుంది. ఇకపై రాత్రి చపాతీలు మిగిలిపోయాయని బాధపడకుండా, ఐదు నిమిషాల్లో ఇలా గుజరాతీ స్టైల్ పోహా ట్రై చేసి వేడివేడి టీతో లాగించేయండి.
ఈ పోహా కేవలం రుచికరమైన టిఫిన్ మాత్రమే కాదు, శరీరానికి పలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అవి ఏంటంటే..
* చపాతీలు చల్లారిన తర్వాత వాటిలోని స్టార్చ్ ‘రెసిస్టెంట్ స్టార్చ్’గా మారుతుంది. ఇది పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా (ప్రీబయోటిక్) ఉపయోగపడుతుంది. ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు గ్యాస్, ఎసిడిటీ రాకుండా అడ్డుకుంటుంది.
* తాజా వేడి చపాతీల కంటే చల్లారిన లేదా కాస్త నిల్వ ఉన్న చపాతీలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. నిదానంగా జీర్ణమవుతూ స్థిరమైన శక్తినిస్తాయి.
* ఇందులో ఇంగువ & జీలకర్ర ఉపయోగించడం వల్ల జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి, అజీర్తి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.
* పసుపు & కరివేపాకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
* డీప్ ఫ్రై చేసిన పూరీలు, బజ్జీలు లేదా నూనె ఎక్కువగా ఉండే దోశలతో పోలిస్తే, ఈ పోహా తయారీకి కేవలం ఒక్క స్పూన్ నూనె మాత్రమే పడుతుంది. గోధుమల్లోని పీచు పదార్థం (ఫైబర్) వల్ల కాసేపటికే కడుపు నిండిన భావన కలిగి, అనవసరమైన చిరుతిళ్లు తినకుండా బరువును అదుపులో ఉంచుతుంది.
* రాత్రి మిగిలిన గోధుమ రొట్టెల్లో ఐరన్, మెగ్నీషియం, విటమిన్-బి వంటి సూక్ష్మపోషకాలు అలాగే ఉంటాయి. ఇవి అలసటను తగ్గించి రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు దోహదపడతాయి.
నోట్: ఫ్రిజ్లో భద్రపరిచిన లేదా తేమ తగలకుండా భద్రంగా ఉన్న రాత్రి మిగిలిన చపాతీలను మాత్రమే దీని కోసం ఉదయం వాడాలి. దుర్వాసన వచ్చినా, బూజు పట్టినా అస్సలు ఉపయోగించకూడదు.

