Homemade Pani Puri: సాయంత్రం కాగానే వీధి చివర ఉండే చాట్ బండి గుర్తొచ్చి నోరూరే వారు మిలో చాలామందే ఉన్నారు కదూ.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి ఆల్-టైమ్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ‘పానీపూరి’. కరకరలాడే పూరీలో వేడివేడి బంగాళాదుంప మసాలా నింపి, పుల్లపుల్లగా, కారంగా ఉండే పులుపు, కారం పానీని ముంచి నోట్లో పెట్టుకుంటే వచ్చే ఆ కిక్కే వేరు.
అయితే బయట అమ్మే పానీపూరి రుచిగా ఉన్నప్పటికీ.. అక్కడ వాడే నీరు, నూనె నాణ్యత విషయంలో ఆరోగ్యపరంగా ఎన్నో అనుమానాలు ఉంటాయి. మరి అదే స్ట్రీట్ స్టైల్ టేస్ట్‌ను ఇంట్లోనే అత్యంత శుభ్రంగా, పక్కా కొలతలతో సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
క్రిస్పీ పూరీల తయారీ:
కావలసిన పదార్థాలు:
* బొంబాయి రవ్వ (సూజీ) – 1 కప్పు,
* మైదా – 2 టేబుల్ స్పూన్లు (పావు కప్పు),
* వంట సోడా – చిటికెడు,
* ఉప్పు – తగినంత,
* మరిగించిన నీళ్లు – సరిపడా,
* నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ విధానం విషయానికి వస్తే.. ముందుగా ఒక గిన్నెలో రవ్వ, మైదా, ఉప్పు, వంట సోడా వేసి కలపాలి. మరిగించిన వేడి నీటిని కొద్దికొద్దిగా పోస్తూ స్పూన్ లేదా ఫోర్క్‌తో కలపాలి. వేడి తగ్గాక చేత్తో 5-10 నిమిషాల పాటు ఒత్తుతూ మరీ గట్టిగా కాకుండా, పల్చగా కాకుండా సాఫ్ట్‌గా పిండిని సిద్ధం చేసుకోవాలి. చివరగా కొద్దిగా ఆయిల్ రాసి, తడి గుడ్డ కప్పి 20-25 నిమిషాలు నానబెట్టాలి.
అలా చేసిన పిండిని నాలుగు భాగాలుగా చేసి, మైదా చల్లుకుంటూ పల్చగా చపాతీలా రోల్ చేయాలి. చిన్న గిన్నె లేదా రౌండ్ కట్టర్‌తో పూరీల సైజులో కట్ చేసుకోవాలి. బాండీలో ఆయిల్ బాగా వేడయ్యాక, మంటను మీడియం లేదా హై ఫ్లేమ్‌లో ఉంచి ఒక్కొక్క పూరీ వేసి గరిటతో నొక్కితే చక్కగా పొంగుతాయి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
స్టఫింగ్ (ఆలూ-బఠాణీ కర్రీ):
కావలసిన పదార్థాలు:
* బంగాళాదుంపలు – 2 (మీడియం),
* తెల్ల బఠాణీలు – 2 టేబుల్ స్పూన్లు (అరగంట నానబెట్టినవి),
* కారం – 1 టీస్పూన్,
* ధనియాల పొడి – 1 టీస్పూన్,
* జీలకర్ర పొడి – 1/4 టీస్పూన్,
* చాట్ మసాలా (లేదా గరం మసాలా) – 1/4 టీస్పూన్,
* ఉప్పు – తగినంత,
* కొత్తిమీర – కొద్దిగా.
స్టఫింగ్ కోసం ముందుగా.. బంగాళాదుంపలు, నానబెట్టిన బఠాణీలను కుక్కర్‌లో ఉప్పు వేసి 4-5 విజిల్స్ రానిచ్చి ఉడికించాలి. బంగాళాదుంపల పొట్టు తీసి, బఠాణీలతో కలిపి బౌల్‌లో మెత్తగా మ్యాష్ చేయాలి. అందులోనే కారం, ఉప్పు, చాట్ మసాలా, జీలకర్ర, ధనియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటే స్టఫింగ్ రెడీ.
పుల్లపుల్లని ఘాటైన పానీ..
కావలసిన పదార్థాలు:
* పుదీనా – 1/2 కప్పు,
* కొత్తిమీర – 1/2 కప్పు,
* పచ్చిమిర్చి – 1,
* అల్లం – 1 అంగుళం ముక్క,
* పల్చటి చింతపండు రసం – 1 కప్పు,
* చల్లని నీళ్లు – 2 కప్పులు,
* జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్,
* చాట్ మసాలా – 1 టీస్పూన్,
* మిరియాల పొడి – 1/4 టీస్పూన్,
* ఎండు కారం – 1/4 టీస్పూన్,
* ఉప్పు – తగినంత.
పానీ కోసం ముందుగా మిక్సీ జార్‌లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, చింతపండు రసం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్ట్రైనర్ సహాయంతో బౌల్‌లోకి వడకట్టాలి. ఆ రసంలో 2 కప్పుల నీళ్లు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, మిరియాల పొడి, కారం, ఉప్పు వేసి కలపాలి. మరింత పులుపు కావాలనుకుంటే కాస్త నిమ్మరసం పిండుకోవచ్చు. అంతే వీటన్నిటిని బాగా కలిసేలా బాగా కలియ తిప్పాలి. ఇప్పుడు మనకు కావాల్సిన పానీ రెడీ.
సర్వింగ్:
ముందుగా ఒక పూరీని మధ్యలోకి పగలగొట్టి, అందులో చెంచాడు ఆలూ-బఠాణీ మసాలా స్టఫ్ చేయాలి. సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా హాట్ అండ్ స్వీట్ టొమాటో చిల్లీ సాస్ (స్వీట్ చట్నీకి బదులుగా) వేసి, చివరగా ఘాటైన పుదీనా పానీని నింపి వెంటనే తింటే అచ్చం బండి దగ్గర తిన్న టేస్ట్‌ను ఆస్వాదించవచ్చు.

