Bubble Gum: మనం సరదాగా నమిలే బబుల్ గమ్ ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా?

Bubble Gum

Bubble Gum

Bubble Gum: మనం సరదాగా నమిలి, బుడగలు ఊదే ‘బబుల్ గమ్’ వెనుక ఒక ఆసక్తికరమైన, ఆకస్మికమైన (యాదృచ్ఛిక) చరిత్ర దాగి ఉందని మీకు తెలుసా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు ఎంతగానో ఇష్టపడే ఈ బబుల్ గమ్ ఒక సైంటిస్ట్ వల్ల కాకుండా, ఒక కంపెనీలో లెక్కలు చూసుకునే అకౌంటెంట్ వల్ల ప్రపంచానికి పరిచయం అయ్యింది. మానవులకు వేల సంవత్సరాల క్రితం నుంచే చెట్ల జిగురును నమిలే అలవాటు ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. మాయన్లు సపోడిల్లా చెట్టు జిగురును, గ్రీకులు మాస్టిక్ చెట్టు జిగురును నమిలేవారు. ఆధునిక కాలంలో 1840లలో జాన్ బి.కర్టిస్ మొదటిసారిగా వాణిజ్యపరమైన చూయింగ్ గమ్‌ను తయారు చేయగా, 1800ల చివరలో థామస్ ఆడమ్స్ సపోడిల్లా జిగురుతో మరింత మృదువైన చూయింగ్ గమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇవన్నీ కేవలం నమలడానికి మాత్రమే పనికొచ్చేవి, కానీ వీటితో బుడగలు ఊడటం సాధ్యపడేది కాదు.

అకౌంటెంట్ చేతిలో అద్భుతం

1920లలో ఫిలడెల్ఫియాకు చెందిన ‘ఫ్లీర్ కార్పొరేషన్’ బుడగలు ఊదడానికి వీలయ్యే బబుల్ గమ్‌ను తయారు చేయడానికి ఎన్నో ప్రయోగాలు చేసి ఫేయిల్ అయ్యింది. ఆ సమయంలో అదే కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేసే ‘వాల్టర్ డీమర్’ ఖాళీ సమయాల్లో ల్యాబ్‌లో రకరకాల ఫార్ములాలతో ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేశాడు. అలా ఎన్నో ప్రయత్నాల తర్వాత, 1928లో ఆయన ఒక ప్రత్యేకమైన ఫార్ములాను కనుగొన్నారు. ఈ కొత్త గమ్ సాగే గుణాన్ని కలిగి ఉండి, అతుక్కోకుండా, పెద్ద బుడగలు ఊదడానికి వీలుగా మారింది. అలా ప్రపంచంలోనే మొట్టమొదటి సక్సె్స్‌ఫుల్‌గా బబుల్ గమ్ పుట్టుకొచ్చింది. నిజానికి బబుల్ గమ్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది గులాబీ రంగే. అయితే ఈ రంగును ప్రత్యేకంగా ఎంచుకోలేదు. వాల్టర్ డీమర్ మొదటిసారి ఆ గమ్‌ను తయారు చేసినప్పుడు, ఆ ల్యాబ్‌లో అందుబాటులో ఉన్న ఏకైక ఫుడ్ కలర్ గులాబీ రంగు మాత్రమేనట. దాంతో ఆయన దాన్నే ఉపయోగించాల్సి వచ్చింది. ఆ రంగు కాస్తా కాలక్రమేణా బబుల్ గమ్‌కు ఒక ఐకానిక్ సింబల్‌గా మారిపోయింది.

×
×
Ad

ఫ్లీర్ కంపెనీ ఈ గమ్‌ను ‘డబుల్ బబుల్’ పేరుతో మార్కెట్లోకి తెచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు రేషన్‌గా చూయింగ్ గమ్ ఇవ్వడం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. 1947లో వచ్చిన ‘బజూకా’ గమ్ కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. బబుల్ గమ్‌తో బుడగలు ఊదడం అనేది ఒక కళగా మారి పోటీలకు కూడా దారితీసింది. 2004లో ‘చాడ్ ఫెల్’ అనే వ్యక్తి చేతులు ఉపయోగించకుండా ఏకంగా 50.8 సెంటీమీటర్ల (20 ఇంచుల) వ్యాసం కలిగిన అతిపెద్ద బుడగను ఊది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇలా ఒక చిన్న ల్యాబ్‌లో అనుకోకుండా జరిగిన ఆవిష్కరణ, నేడు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి వినోదాన్ని, ఉపాధిని క్రియేట్ చేసింది.