Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..

Arthritis Pain In Monsoon

Arthritis Pain In Monsoon

Arthritis Pain in Monsoon: వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి మాత్రం ఇది కీళ్ల నొప్పిని మరింత పెంచే కాలంగా మారుతుంది. ముఖ్యంగా మోకాళ్లు, భుజాలు, తుంటి భాగాల్లో నొప్పి, బిగుతు, అసౌకర్యం ఎక్కువగా అనిపిస్తుంటాయి. అయితే ఈ సమస్యను నాలుగు నెలలు భరించాల్సిందే అనే అవసరం లేదని ఆర్థోపెడిక్ నిపుణులు చెబుతున్నారు. కారణాలను అర్థం చేసుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నొప్పిని గణనీయంగా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

వర్షాకాలంలో తేమ పెరగడం, వాతావరణ పీడనం (బారోమెట్రిక్ ప్రెషర్) తగ్గడం కీళ్ల నొప్పి పెరగడానికి ప్రధాన కారణాలు. వాతావరణ పీడనం తగ్గినప్పుడు కీళ్ల చుట్టూ ఉన్న కణజాలం స్వల్పంగా విస్తరించి, సున్నితమైన నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల నొప్పి, బిగుతు ఎక్కువగా అనిపించవచ్చు. అలాగే చల్లటి, తడి వాతావరణం వల్ల కండరాలు, లిగమెంట్లు బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది. వర్షాల కారణంగా శారీరక శ్రమ తగ్గిపోవడం కూడా కీళ్ల బిగుతును మరింత పెంచుతుంది. ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పాత క్రీడా గాయాలు లేదా దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

వర్షాకాలంలో కీళ్ల నొప్పి తగ్గించేందుకు 5 చిట్కాలు

1. శారీరక శ్రమ ఆపొద్దు: వర్షాల కారణంగా ఇంట్లోనే ఉండాల్సి వచ్చినా, తేలికపాటి వ్యాయామాలు, స్ట్రెచింగ్‌ను కొనసాగించాలి. దీంతో కీళ్లు చురుకుగా ఉండి బిగుతు తగ్గుతుంది.

2. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవద్దు: తేమ ఎక్కువగా ఉన్న రోజుల్లో గంటల తరబడి కూర్చోవడం వల్ల కీళ్లు మరింత బిగుసుకుపోతాయి. ప్రతి 30 నుంచి 40 నిమిషాలకు ఒకసారి లేచి కొద్దిసేపు నడవడం మంచిది.

3. సమతుల ఆహారం తీసుకుని బరువును నియంత్రించండి: కాల్షియం, విటమిన్-డి అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అధిక బరువు మోకాళ్లు, తుంటి కీళ్లపై అదనపు ఒత్తిడిని పెంచి నొప్పిని మరింత తీవ్రం చేస్తుంది.

4. తగినంత నీరు తాగండి: వర్షాకాలంలో దాహం తక్కువగా అనిపించినా, శరీరానికి అవసరమైనంత నీరు తాగడం తప్పనిసరి. ఇది శరీర ఆరోగ్యంతో పాటు కీళ్ల పనితీరుకు కూడా మేలు చేస్తుంది.

5. వైద్యుల సూచించిన మందులు, ఫిజియోథెరపీని కొనసాగించండి: నొప్పి పెరిగిందని మందులను మధ్యలో ఆపేయకూడదు. వైద్యులు సూచించిన మందులు, ఫిజియోథెరపీ వ్యాయామాలను క్రమం తప్పకుండా కొనసాగించడం వల్ల కీళ్ల సమస్యలను నియంత్రించవచ్చు.