Ragi Pindi Upma: రోజూ ఉదయం లేవగానే టిఫిన్ ఏం చేయాలనే చర్చ మీ ఇంట్లో కూడా ఉంటుందా? ఇడ్లీ, దోశలు తిని బోర్ కొట్టిందా.. అయితే కేవలం ఐదే ఐదు నిమిషాల్లో ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే సరికొత్త బ్రేక్‌ఫాస్ట్‌ను రెడీ చేసుకోవచ్చని మీకు తెలుసా. రాగి పిండితో ఎప్పుడూ జావ లేదా రొట్టెలే కాకుండా, ఎంతో స్పెషల్‌గా, అద్భుతమైన రుచితో ‘రాగి పిండి ఉప్మా’ (Ragi Pindi Upma) ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలని ఉందా. డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి, ఉదయం ఆఫీసులకు వెళ్లే వారికి తక్కువ సమయంలో చేసుకోగలిగే పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ ఇది. ఈ ఉప్మా ప్రత్యేకతలు, దాని తయారీ విధానాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
రాగి పిండి – బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ)
తాలింపు గింజలు (ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు)
పల్లీలు, జీడిపప్పు ముక్కలు
పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు
టొమాటో ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర
నూనె లేదా నెయ్యి, ఉప్పు, నీళ్లు
తయారీ విధానం..
ముందుగా కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో పల్లీలు, జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో తాలింపు గింజలు, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి టొమాటోలు మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. టొమాటోలు మగ్గిన తర్వాత, అందులోనే బొంబాయి రవ్వ – రాగి పిండిని వేసి నూనెలోనే కాసేపు బాగా వేయించుకోవాలి. (ఇలా చేయడం వల్ల ఉప్మా ఉండలు కట్టకుండా, పొడిపొడిగా వస్తుంది).
ఇప్పుడు పిండి బాగా వేగిన తర్వాత తగినన్ని నీళ్లు (ఎసరు) పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆపై మంటను సిమ్‌లో ఉంచి, మూత పెట్టి ఉప్మా దగ్గరపడే వరకు ఉడికించుకోవాలి. ఉప్మా చక్కగా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు ముక్కలు చల్లుకుని బాగా కలుపుకుని స్టౌ ఆపేయాలి. అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే హెల్తీ రాగి పిండి ఉప్మా రెడీ. రోజూ తినే రొటీన్ టిఫిన్స్‌కు బదులు ఈసారి ఈ హెల్తీ ఉప్మాను ట్రై చేసి చూడండి.
రాగి పిండి ఉప్మా ప్రత్యేకతలు..
* ఉదయం పూట హడావుడి లేకుండా కేవలం 5 నిమిషాల్లోనే ఈ ఉప్మాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.
* రాగులలో ఉండే ఫైబర్, క్యాల్షియం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి అవసరమైన శక్తి లభిస్తుంది.
* ఈ వేడి వేడి రాగి ఉప్మాను పల్లి చట్నీతో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

