Bird Flu: ఇటీవల కాలంలో “బర్డ్ ఫ్లూ” ప్రపంచాన్ని భయపెడుతుంది. H5N1 బర్డ్ ఫ్లూ కేసులు పలు దేశాల్లో నమోదు అయ్యాయి. ముఖ్యంగా మానవుడికి బర్డ్ ఫ్లూ సోకడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాబోయే కాలంలో సంభావ్య ‘‘మహమ్మారి’’గా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా ఒక అధ్యయనంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణ “సీజనల్ ఫ్లూ(H1N1)” ఇన్ఫెక్షన్ల ద్వారా ఏర్పడిన ‘‘రోగనిరోధక వ్యవస్థ’’ బర్డ్ ఫ్లూ తీవ్రతను తగ్గిస్తుందని తెలిపింది.
Read Also: Trump “Gold Card”: ‘‘గోల్డ్ కార్డ్’’ పౌరసత్వం భారతీయులకు వరమా.? ట్రంప్ ఏమన్నారంటే..
ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. అమెరికాలో నమోదైన H5N1 బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కువగా ఎందుకు ప్రాణాంతకం కాలేదనే విషయాన్ని వివరించింది. పిట్స్‌బర్గ్ అండ్ ఎమోరీ విశ్వవిద్యాలయాల పరిశోధకులు ప్రజల మధ్య వైరస్‌లు వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని డీకోడ్ చేయడానికి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఫెర్రేట్ నమూనాను ఉపయోగించి, ముందుగా ఉన్న రోగ నిరోధక శక్తి ఇన్ఫెక్షన్ వ్యాప్తిని ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు. ఇదే బర్డ్ ఫ్లూ సోకినప్పటికీ ప్రాణాలు పోకుండా రక్షించిందని పరిశోధకులు చెప్పారు.
మానవ రోగనిరోధక ప్రతిస్పందన సంక్లిష్టంగా ఉన్నందున తమ నమూనా పరిపూర్ణంగా లేదని చెబుతూనే, మరింత పరిశోధనలు చేయాల్సిన అవసరాన్ని పరిశోధకులు నొక్కిచెప్పారు. H5N1తో ఇంట్రానాసల్‌గా సోకిన జంతువుల్లో కొన్ని, గతంలో సీజనల్ ఫ్లూకి గురైనట్లు, అవి ఇన్ఫెక్షన్ నుంచి బయటపడినట్లు పరిశోధకులు గుర్తించారు. గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ల నుండి వచ్చిన రోగనిరోధక శక్తి జంతువుల ముక్కు రంధ్రాల నుండి వైరస్‌ను వేగంగా తొలగించడానికి, ఇన్ఫెక్షన్‌ను శ్వాసకోశానికి పరిమితం చేయడానికి సహాయపడిందని పరిశోధకులు గుర్తించారు.