Diabetes Cases in 2024: భారత్‌లో వ్యాధిగ్రస్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారిన జీవన శైలి, కల్తీ ఆహారంతో కొత్త వ్యాధులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే.. భారత్‌లో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య ఊహించని రీతిలో పెరుగుతోంది. తాజాగా విడుదలైన ఓ రిపోర్టు అందరిని మరోసారి అప్రమత్తం చేసింది. 2024లో ప్రపంచంలో మధుమేహంతో బాధపడుతున్న పెద్దల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. భారత్‌లో దాదాపు 9 కోట్ల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారని ‘ది లాన్సెట్ డయాబెటీస్ అండ్ ఎండోక్రినాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉంది. చైనాలో 14.8 కోట్ల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారు. మూడో స్థానంలో యూఎస్ ఉంది. అమెరికాలో 3.9 కోట్ల మంది వ్యాధిగ్రస్థులు ఉన్నారు.
READ MORE: Huge Demand for Kosa Meat: ఓడిపోయిన పందెం కోళ్లకు ఫుల్ డిమాండ్..
ఈ పరిశోధనలో బెల్జియంలోని ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్, చెన్నైలోని ఇండియా డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్, డాక్టర్ ఏ. రామచంద్రన్ డయాబెటీస్ హాస్పిటల్‌కు చెందిన నిపుణులు పాల్గొన్నారు. జనాభా ఎక్కువగా ఉన్న చైనా, భారత్, అమెరికా, పాకిస్థాన్ వంటి దేశాల్లో మధుమేహ రోగుల అత్యధికంగా ఉన్నారని తేలింది. భవిష్యత్తులో పాకిస్థాన్ కూడా అమెరికాను దాటి మధుమేహ రోగుల సంఖ్యలో ముందుకు రావచ్చని అంచనా వేశారు. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ విడుదల చేసిన 11వ డయాబెటీస్ అట్లాస్ ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 58.9 కోట్ల మంది పెద్దలకు మధుమేహంతో బాధపడుతున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 85.3 కోట్లకు చేరవచ్చని అంచనా. అంటే ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి మధుమేహం ఉన్నట్టే.
READ MORE: Hyderabad: మద్యం గ్లాస్ కోసం ఘర్షణ.. అన్నను చంపిన తమ్ముడు..
ఈ అధ్యయనాన్ని 2005 నుంచి 2024 మధ్య కాలంలో 215 దేశాలు, ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ మధ్య కాలంలో దాదాపు 246 పరిశోధనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో ఉన్న వారిలో సుమారు 80 శాతం మంది అత్యధిక, మధ్య ఆదాయ దేశాల్లోనే ఉన్నారని అంచనా. 2050 నాటికి మధుమేహ కేసుల పెరుగుదలలో 95 శాతం వరకు ఈ దేశాల్లోనే ఉండే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. జనాభా పెరుగుదల, వృద్ధుల సంఖ్య పెరగడం, వేగంగా జరుగుతున్న పట్టణీకరణ వంటి కారణాలు మధుమేహం పెరుగుదలకు దోహదపడుతున్నాయని తెలిపారు. వయస్సు పెరిగే కొద్దీ మధుమేహం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం స్పష్టం చేసింది. 75 నుంచి 79 ఏళ్ల వయస్సు గల పెద్దల్లో దాదాపు 25 శాతం మందికి మధుమేహం ఉన్నట్టు తేలింది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో, గ్రామాల కంటే పట్టణాల్లో మధుమేహం ఎక్కువగా ఉందని గుర్తించారు.
