Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

Ragi Recipes

Ragi Recipes

Ragi Samosa: సరదాగా సాయంత్రం వేళ వేడివేడి టీతో పాటు ఒక సమోసా తింటే ఉంటుంది.. ఆ మజాయే వేరు. అయితే సాధారణంగా మైదాతో చేసే సమోసాలు రుచిగా ఉన్నా, ఆరోగ్యానికి అవి అంత మంచివి కావనే ఆందోళన చాలామందిలో ఉంటుంది. అలాంటి వారి కోసం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన ఈ ‘రాగి సమోసా’ సూపర్ ఛాయిస్‌గా పని చేస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేలా, పోషకాలు నిండిన రాగి పిండితో ఎంతో రుచికరమైన సమోసాలను తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా రాగి సమోసాలను ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అవసరమైన పదార్థాలు:

రాగి పిండి – 1 కప్పు

ఉడికించిన బంగాళదుంప ముక్కలు – 1 కప్పు

సజ్జ పిండి – కొద్దిగా

జీలకర్ర, వాము – తగినంత

కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు

ఉల్లిపాయ ముక్కలు

జీడిపప్పు, కిస్మిస్ ముక్కలు

పచ్చి బఠానీలు

చింతపండు రసం – 2 టేబుల్ స్పూన్లు

నూనె – వేయించడానికి సరిపడా

ఉప్పు – రుచికి తగినంత

తయారీ విధానం:
ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి తర్వాత జీడిపప్పు, కిస్మిస్ ముక్కలను వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరికొంత నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత పసుపు, ఉప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు వేసి కలపాలి. దీనికి చింతపండు రసం, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ముక్కలు కూడా కలిపి స్టఫ్ఫింగ్ రెడీ చేసుకోవాలి.

తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌లో రాగి పిండి, కొద్దిగా సజ్జ పిండి, వాము, ఉప్పు, వేడి నూనె వేసి, తగినన్ని నీళ్లతో చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీలా ఒత్తుకోవాలి. వాటిని సమోసా ఆకారంలో మలుచుకుని, ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప స్టఫ్ఫింగ్ అందులో నింపాలి. ఇలా రెడీ చేసుకున్న సమోసాలను ఓవెన్‌లో పెట్టి బేక్ చేసుకోవాలి (లేదా నూనెలో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు). సమోసాలు బాగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన రాగి సమోసా రెడీ అయిపోతాయి. చిరుధాన్యాలతో చేసే ఈ రాగి సమోసా కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, సాయంత్రం వేళ పిల్లలకు, పెద్దలకు ఒక ఆరోగ్యకరమైన స్నాక్ ఆప్షన్‌గా పని చేస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు
సాధారణ మైదా సమోసాతో పోలిస్తే, రాగి సమోసా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిజానికి రాగిలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల అనవసరమైన ఆకలి తగ్గుతుంది. అలాగే ధాన్యాలన్నింటిలో రాగిలోనే అత్యధిక క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకల బలానికి, పళ్ల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకు, వృద్ధులకు ఇది చాలా మేలు చేస్తుంది. మైదాతో పోలిస్తే రాగికి ‘గ్లైసీమిక్ ఇండెక్స్’ తక్కువ. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా పరిమితంగా వీటిని తీసుకోవచ్చు.

రాగిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇది మంచి ఆహారంగా పని చేస్తుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. రాగిలో ఉండే ‘అమినో యాసిడ్స్’ శరీరంలోని కొవ్వును తగ్గించడంలో తోడ్పడతాయి. రాగి సహజంగానే గ్లూటెన్ రహిత ధాన్యం. కాబట్టి గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమోసాలను తింటూ ఆస్వాదించవచ్చు. ఈ రెసిపీలో వాడే జీడిపప్పు, కిస్మిస్, బఠానీలు, బంగాళదుంపల ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, పొటాషియం అందుతాయి. సమయం ఉన్నప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ఈ హెల్తీ సమోసాలను చేయడానికి ప్రయత్నించండి.