పాలు బలవర్థకమైన ఆహార పదార్థము. అన్ని వయసుల వారు తీసుకోగల ఉత్తమ మైన ఆహార పదార్థం. పాలలో ఎన్నో రకాల పోషకాలున్నాయి. ప్రతి రోజు పాలను తీసుకోవడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. పాలల్లో కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. అయితే కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే పాలు తాగే అలవాటు ఉంటుంది. పరగడుపున గోరు వెచ్చని పాలు సేవిస్తుంటారు. పిల్లలకు కూడా పట్టిస్తుంటారు. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలుసు. పరగడుపున ఖాళీ కడుపుతో పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా.
ఖాళీ కడుపుతో పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పాలు తాగడం వల్ల కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు శరీరానికి అందుతాయి. ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల గ్యాస్, త్రేనుపు వంటి సమస్యలు నయమవుతాయంటున్నారు. పాలలో ఉండే కొవ్వు పొట్టలోని పొరల్లో వ్యాపించి చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది. పొద్దున్నే పాలు తాగడం వల్ల త్వరగా ఆకలి వేయదు. దీంతో జీర్ణవ్యవస్థ కూడా మెరుగవుతుంది. పాలలోని కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. పాల నుంచి విటమిన్ డి కూడా అందుతుంది. ఇది మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది.
చర్మం, జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచడంలో పాలు ఉపయోగపడుతాయి. పాలు తాగటం వల్ల కళ్ళు తేటగా ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటిలోకి సరిపడా శక్తి చేరుకుంటుంది. అయితే పాలు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ కొందరు మాత్రం దూరంగా ఉంటారు. వారికి ఖాళీ కడుపుతో పాలు తాగితే కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతుంటాయి. కొందరికి ఉదయాన్నే పాలు తాగడం వల్ల శరీరంలో యాసిడ్ ఉత్పత్తి పెరిగి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి వారు పాలను ఆహారంగా తీసుకోకపోవడమే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.