Health Benefits Cloves: సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. మసాలా, మాంసాహార వంటకాల్లో వీటిని తప్పనిసరిగా వాడతారు. కమ్మని వాసననీ, రుచినీ అందించే ఈ లవంగాల వల్ల ఆరోగ్యానికెంతో మేలు.
* లవంగాలను ప్రతిరోజూ కూరల్లో వాడటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మేలు చేసే ఎంజైములు జీర్ణాశయంలో విడుదలవుతాయి. వికారం, వాంతుల వంటివి తగ్గుతాయి. కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు లవంగాలను వేడి పెనం మీద కాసేపు ఉంచి, పొడి చేసి తేనెలో కలిపి తీసుకోవాలి. దీనివల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
* మధుమేహం ఉన్నవారు లవంగాలను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. మధుమేహంతో బాధపడే వారు వీటిని ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే ఫ్లవనాయిడ్లు శరీరానికి అందడం వల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది. ముఖ్యంగా మెనోపాజ్ దశలోని మహిళలకు వీటితో ఎంతో మేలు.
* లవంగాలు వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. ఇన్‌ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి. కండరాలూ, కీళ్లనొప్పుల్ని తగ్గిస్తాయి. కాలేయ సంబంధిత సమస్యలనూ అదుపులోకి తీసుకొస్తాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో లవంగాల్లోని పోషకాలు కీలకంగా వ్యవహరిస్తాయి.
* తలనొప్పిగా ఉన్నప్పుడు గ్లాసు పాలలో కొద్దిగా లవంగాల పొడీ, రాతి ఉప్పూ వేసి తాగాలి. దీనివల్ల కాసేపటికి తలనొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.