NTV Telugu Site icon

Uterine cancer: గర్భాశయ క్యాన్సర్లకు కారణం అవుతున్న హెయిర్ స్టైలింగ్ రసాయనాలు..

Uterine Cancer

Uterine Cancer

Chemicals in hair straightening products linked to uterine cancer: మహిళల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ కాన్సర్లు ఒకటి. బ్రెస్ట్ క్యాన్సర్లతో పాటు గర్భాశయ క్యాన్సర్లు మహిళల్లో తరుచుగా వస్తుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ అధ్యయనంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తుల్లోని రసాయనాలు గర్భాశయ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతున్నాయని తేలింది. అమెరికాలో 33,497 మంది మహిళలపై నిర్వహించిన ఆధ్యయనంలో ఈ విషయం తెలిసింది. మనం సౌందర్యానికి, మంచి హెయిర్ స్టైల్ కు వాడే రసాయనాలే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని తేలింది.

Read Also: Y.S. Sharmila: దళిత బందును కాస్తా అనుచరుల బందు చేశారు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం శాస్త్రవేత్తలు యూఎస్ఏలో 35-75 ఏళ్ల వయసు గల 33 వేల మంది మహిళల డేటాను సేకరించారు. దాదాపుగా 11 ఏళ్ల పాటు మహిళల ఆరోగ్య విషయాలను సేకరించారు. ఆ సమయంలో 378 గర్భాశయ క్యాన్సర్లు నమోదు అయ్యాయి. హెయిర్ స్ట్రెయిట్నర్లను ఎప్పుడూ ఉపయోగించని మహిళల్లో 1.64 శాతం గర్భాశయ క్యాన్సర్లు గుర్తిస్తే.. తరుచుగా వాడే వారిలో 4.05 శాతం గర్భాశయ క్యాన్సర్లు నమోదు అయ్యాయని పరిశోధకులు తెలిపారు. హెయిర్ స్ట్రెయిట్నర్లలో ఉండే పారాబెన్స్, బిస్పినాల్ ఏ వంటి రసాయనాలు క్యాన్సర్లకు దారి తీస్తాయని అధ్యయనంలో తేలింది.

హెయిర్ స్ట్రెయిట్నింగ్ ఉత్పత్తులు వాడని వారితో పోలిస్తే.. వీటిని వాడే వారిలో గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం రెండింతలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. మహిళలు ఉపయోగించే జట్టుకు సంబంధించిన సౌందర్య సాధనాల్లో పారాబెన్లు, బిస్పినాల్ ఏ, ఇతర లోహాలు, ఫార్మాల్డిహైడ్స్ వంటిని గర్భాశయ క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయి. అయితే ఇవే పూర్తిగా క్యాన్సర్లకు దోహదం చేస్తాయో లేదో..? అనే విషయాన్ని మరిన్ని పరిశోధనలు చేసి తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.