Cancer Research Study: క్యాన్సర్ రోగులకు శుభవార్త అందింది. త్వరలో క్యాన్సర్‌ను తగ్గించే చికిత్స రాబోతోంది! ఎలుకలపై చేసిన ఒక అధ్యయనంలో క్యాన్సర్ వల్ల శరీరంలో ఉండే కార్టికోస్టెరోన్ అనే హార్మోన్ లయ (రిథమ్) దెబ్బతింటుందని, ఆ లయను మళ్లీ సరిచేస్తే క్యాన్సర్ కణితులు గణనీయంగా చిన్నవయ్యాయని పరిశోధకులు గుర్తించారు. ఈ ఫలితాలు ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ చికిత్సలు మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి సహాయపడవచ్చని వారు భావిస్తున్నారు. శరీరంలోని బయోలాజికల్ క్లాక్‌ను (సర్కేడియన్ క్లాక్) లక్ష్యంగా చేసుకుని, మందులు సరైన సమయానికి ఇవ్వడం ద్వారా క్యాన్సర్‌ను తగ్గించవచ్చని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు సూచించాయి. దీనినే ‘క్రోనోథెరపీ’ అంటారు. తాజా పరిశోధనకు నాయకత్వం వహించిన జెరెమీ బోర్నిగర్ మాట్లాడుతూ.. తాము ఎలుకలకు నేరుగా క్యాన్సర్ మందులు ఇవ్వలేదని చెప్పారు. “రోగి శరీరంగా ఎంత ఆరోగ్యంగా ఉంటే, అదే క్యాన్సర్‌తో పోరాడుతుంది. ఇలా శరీర లయను సరిచేయడం వల్ల భవిష్యత్తులో చికిత్సల ప్రభావం పెరిగి, వాటి దుష్ప్రభావాలు కూడా తగ్గవచ్చు” అని ఆయన అన్నారు.
మన శరీరంలో హైపోథాలమస్, పిట్యూటరీ గ్రంథి, అడ్రినల్ గ్రంథులు కలిసి పనిచేసే ఒక వ్యవస్థ ఉంటుంది. దీన్ని హెచ్‌పీఏ అక్షం అంటారు. ఇది మన శరీరంలో రోజు–రాత్రి లయ సక్రమంగా ఉండేలా చేస్తుంది. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కలిగిన ఎలుకల్లో కార్టికోస్టెరోన్ అనే స్ట్రెస్ హార్మోన్ లయ తీవ్రంగా దెబ్బతింటున్నట్టు పరిశోధకులు గమనించారు. సాధారణంగా ఈ హార్మోన్ స్థాయులు రోజంతా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. కణితులు బయటకు కనిపించేలోపే, కేవలం మూడు రోజుల్లోనే ఈ హార్మోన్ లయలో 40 నుంచి 50 శాతం వరకు తగ్గుదల కనిపించిందని బోర్నిగర్ తెలిపారు. ఎలుకల మెదడులోని హైపోథాలమస్‌ను పరిశీలించగా, ముఖ్యమైన న్యూరాన్లు చాలా యాక్టివ్‌గా ఉన్నప్పటికీ సరైన అవుట్‌పుట్ ఇవ్వని స్థితిలో ఉన్నట్టు తెలిసింది. ఆ న్యూరాన్లను మళ్లీ సహజమైన రోజు–రాత్రి చక్రంలా పనిచేసేలా ఉత్తేజితం చేయగా, స్ట్రెస్ హార్మోన్ లయ మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. దాంతో క్యాన్సర్‌ను ఎదుర్కొనే ఇమ్యూన్ కణాలు కణితులలోకి ఎక్కువగా చేరి, ట్యూమర్లు గణనీయంగా చిన్నవయ్యాయి. సరైన సమయానికి ఈ ఉత్తేజన ఇవ్వడం వల్లే ఈ ఫలితం వచ్చిందని పరిశోధకులు తెలిపారు. తప్పు సమయానికి ఇస్తే ఇలాంటి ప్రభావం కనిపించలేదని కూడా చెప్పారు. పరిశోధకుల మాటల్లో, సరైన సమయంలో శరీర లయను పునరుద్ధరించడం ఇమ్యూన్ వ్యవస్థకు క్యాన్సర్ కణాలను చంపే శక్తిని పెంచుతుంది. ఇది ఎలా జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఇంకా పరిశోధన అవసరమని చెప్పారు.
