Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!

Thandai Masala Recipe

Thandai Masala Recipe

Thandai Masala Recipe: వేసవి వేడిని తట్టుకోవడానికి శరీరాన్ని చల్లబరచే పానీయాలు ఎంతో అవసరం. అలాంటి వాటిలో సాంప్రదాయ భారతీయ పానీయం తండై ఒకటి. రుచి, సువాసనతో పాటు శరీరానికి చల్లదనం ఇచ్చే ఈ పానీయం, ముఖ్యంగా వేసవిలో తాగితే అలసటను తగ్గించి శక్తినిస్తుంది. మార్కెట్లో లభించే రెడీమేడ్ మిశ్రమాల కంటే ఇంట్లో తయారు చేసిన తండై మసాలా మరింత స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. తండై మసాలాలో ఉపయోగించే డ్రైఫ్రూట్స్, గింజలు, సుగంధ ద్రవ్యాలు శరీరానికి పోషకాలు అందించడమే కాకుండా, లోపలి నుండి చల్లదనం కలిగిస్తాయి. ఇందులో ఉండే సోంపు, గసగసాలు, కుంకుమపువ్వు వంటి పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తూ, శరీరాన్ని శాంతంగా ఉంచుతాయి.

తండై మసాలాకు కావలసిన పదార్థాలు
* అర కప్పు బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులు..
* రెండు టేబుల్ స్పూన్లు సోంపు..
* 2 టేబుల్‌ స్పూన్ల పుచ్చకాయ గింజలు, గసగసాలు..
* 25-30 పచ్చి యాలకులు
* ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు
* 1-2 టేబుల్ స్పూన్లు ఎండిన గులాబీ రేకులు
* అర టీస్పూన్ కుంకుమపువ్వు.

తయారీ విధానం
ముందుగా అన్ని డ్రైఫ్రూట్స్, గింజలను శుభ్రం చేసి పూర్తిగా ఆరబెట్టాలి. వాటిలో తేమ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. తరువాత యాలకులు, నల్ల మిరియాలు, సోంపు, గసగసాలను మిక్సర్‌లో వేసి మెత్తగా పొడిగా చేసుకోవాలి. తరువాత బాదం, జీడిపప్పు, పిస్తా, పుచ్చకాయ గింజలను వేసి మళ్లీ రుబ్బాలి. ఈ మిశ్రమం కొద్దిగా గరుకుగా లేదా మెత్తగా అయ్యాక, ఎండిన గులాబీ రేకులు, కుంకుమపువ్వు వేసి మరోసారి తేలికగా రుబ్బాలి. దీంతో మంచి సువాసనతో కూడిన తండై మసాలా సిద్ధమవుతుంది. తయారైన మసాలాను పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేయాలి. దీన్ని చల్లని, పొడి ప్రదేశంలో లేదా ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువకాలం తాజాగా ఉంటుంది.

తండై తయారీ విధానం
ఒక గ్లాసు చల్లని పాలలో 1-2 టీస్పూన్ల తండై మసాలా కలిపి, తగినంత పంచదార వేసి బాగా కలపాలి. చల్లగా వడ్డిస్తే రుచి మరింత పెరుగుతుంది. ఇలా ఇంట్లోనే తండై మసాలా తయారు చేసుకుని వేసవిలో ఆరోగ్యంగా, చల్లగా ఉండండి. ఒకసారి తాగితేనే ఈ రుచిని ఎవరూ మరచిపోరు.. మళ్లీ మళ్లీ అడుగుతారు..