Bajra Raab Recipe: చలికాలం రాగానే మన ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వస్తుంటాయి. ఈ సీజన్లో రుచిగా ఉండటంతో పాటు శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. అందుకే చలి రోజుల్లో సజ్జలతో చేసే వంటకాలకు డిమాండ్ పెరుగుతుంది. సజ్జ రొట్టెలు, కిచిడీ, ఉప్మా లాంటివి మీరు చాలాసార్లు తిని ఉంటారు కానీ, ఎప్పుడైనా రాజస్థాన్ ఫేమస్ సజ్జ పిండి రాబ్ (బాజ్రా రాబ్) రుచి చూశారా? ఇది రాజస్థాన్‌కు చెందిన సంప్రదాయ పానీయం, ముఖ్యంగా చలికాలంలో దీన్ని ఎంతో ఇష్టంగా తాగుతారు. సజ్జ పిండి, మజ్జిగ, కొన్ని మసాలాలతో తయారు చేసే ఈ రాబ్ రుచికి కాస్త పుల్లగా, ఘాటుగా ఉంటుంది. దీన్ని వేడివేడిగా తాగే మజాయే వేరు. మరి ఈ చలికాలంలో కొత్తగా, దేశీ స్టైల్లో ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇంట్లోనే సులభంగా సజ్జ పిండి రాబ్ చేసుకోవచ్చు. దీని సింపుల్ రెసిపీ ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
సజ్జ పిండి: 1/2 కప్పు
మజ్జిగ: 500 మిల్లీలీటర్లు
నీళ్లు: 1 లీటరు
ఉప్పు: రుచికి తగినంత
జీలకర్ర పొడి: రుచికి తగినంత
కొత్తిమీర: గార్నిష్ చేయడానికి
సజ్జ పిండి రాబ్ ఎలా చేయాలి?
సజ్జ పిండి రాబ్ చేయడానికి ముందుగా ఒక పెద్ద గిన్నెలో సజ్జ పిండి తీసుకోండి. అందులో కొద్దికొద్దిగా మజ్జిగ పోస్తూ బాగా కలపండి. పిండిలో ఉండలు కట్టకుండా జాగ్రత్త పడండి. పిండి, మజ్జిగ బాగా కలిసిన తర్వాత దాన్ని ఒక మట్టి పాత్రలోకి లేదా మందపాటి గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి, హై ఫ్లేమ్ మీద ఆపకుండా కలుపుతూ మరిగించండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మంట తగ్గించి, ఈ మిశ్రమాన్ని సుమారు 20 నిమిషాల పాటు ఉడికించండి. ఈ సమయంలో అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండండి. రాబ్ బాగా ఉడికిన తర్వాత, అందులో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపండి. మసాలాల రుచి బాగా పట్టేలా మరికొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. తయారైన సజ్జ పిండి రాబ్ పైన కొత్తిమీర చల్లి వేడివేడిగా సర్వ్ చేయండి. చలికాలంలో దీన్ని ఉదయం టిఫిన్ టైమ్‌లో గానీ లేదా సాయంత్రం పూట గానీ తాగొచ్చు. రాజస్థాన్ సంప్రదాయ పానీయమైన ఈ రాబ్ రుచికి అద్భుతంగా ఉంటుంది, పైగా దీన్ని చేయడానికి పెద్దగా శ్రమ కూడా ఉండదు.

