Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..

Black Chana Chaat

Black Chana Chaat

Healthy Breakfast Recipe: ఉరుకులు, పరుగుల జీవితంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామందికి ఉదయం నుంచే అలసట, నీరసం సమస్యలు ఎదురవుతున్నాయి. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన అల్పాహారం చాలా ముఖ్యం. అలాంటి సమయంలో ప్రోటీన్ అధికంగా ఉండే నల్ల శనగల చనా చాట్ మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తిని కూడా అందిస్తుంది. నల్ల శనగల్లో ప్రోటీన్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో మధ్యలో ఆకలి వేయకుండా ఉండటంతో పాటు బరువు నియంత్రణకు కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవిలో శరీరానికి తేలికగా, పోషకంగా ఉండే అల్పాహారం కావాలనుకునేవారికి ఈ చనా చాట్ ఎంతో ఉపయోగపడుతుంది.

కావలసిన పదార్థాలు
* ఉడికించిన నల్ల శనగలు – 2 కప్పులు
* సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 చిన్న కప్పు
* సన్నగా తరిగిన టమోటా – 1 చిన్న కప్పు
* ఉడికించిన బంగాళాదుంప ముక్కలు – అర కప్పు (ఐచ్ఛికం)
* పచ్చిమిర్చి ముక్కలు – 1 లేదా 2
* కొత్తిమీర తరుగు – అర కప్పు
* నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు
* చాట్ మసాలా – 1 టీస్పూన్
* వేయించిన జీలకర్ర పొడి – అర టీస్పూన్
* కారం పొడి – పావు టీస్పూన్
* నల్ల ఉప్పు – తగినంత
* దానిమ్మ గింజలు – 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం
ముందుగా రాత్రంతా నానబెట్టిన నల్ల శనగలను ఉప్పుతో మెత్తగా ఉడికించాలి. వాటిలోని నీటిని పూర్తిగా వంపేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమోటా, బంగాళాదుంప ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను శనగల్లో కలపాలి. అనంతరం చాట్ మసాలా, జీలకర్ర పొడి, కారం పొడి, నల్ల ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. చివరగా తాజా నిమ్మరసం చల్లి, కొత్తిమీర తరుగు మరియు దానిమ్మ గింజలతో అలంకరించాలి. అంతే.. రుచికరమైన, ఆరోగ్యకరమైన ప్రోటీన్ రిచ్ చనా చాట్ సిద్ధం. ఉదయాన్నే ఈ చనా చాట్ తింటే రోజంతా శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారు తమ డైట్‌లో ఈ ప్రోటీన్ రిచ్ అల్పాహారాన్ని తప్పకుండా చేర్చుకోవచ్చు.