Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా ఈజీగా చేసుకోండి.!

  • వెరైటీ టేస్ట్‌తో ‘పిచి పొట్టా చికెన్’ స్పెషల్
  • రుచికరమైన రెసిపీకి కావలసిన పదార్థాలు ఇవే
  • పీచుల్లా చికెన్ విడదీయడమే అసలు సీక్రెట్
  • అన్నం, పరోటాతో నోరూరించే కాంబినేషన్
Pichi Potta Chicken

Pichi Potta Chicken

Pichi Potta Chicken : చికెన్‌తో రకరకాల వంటకాలు చేసి బోర్ కొట్టిందా? అయితే ఈసారి సరికొత్తగా, ఎంతో రుచికరంగా ఉండే ‘పిచి పొట్టా చికెన్’ (Pichi Potta Chicken) ట్రై చేయండి. తమిళనాడు వైపు పీచుల్లా విడదీసిన చికెన్‌తో చేసే ఈ స్పెషల్ డ్రై ఫ్రై రెసిపీకి భలే క్రేజ్ ఉంది. అన్నం, పరోటా, చపాతీ లేదా రసంతో నంచుకుని తినడానికి ఇది అద్భుతంగా ఉంటుంది. నోటికి కారంగా, జ్యూసీగా తగిలే ఈ వెరైటీ చికెన్ రెసిపీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

  • బోన్‌లెస్ చికెన్: అర కేజీ
  • రాక్ సాల్ట్ (రాయి ఉప్పు): 1 టీస్పూన్
  • నూనె: 2 టేబుల్ స్పూన్లు
  • సోంపు గింజలు: 1 టీస్పూన్
  • దాల్చినచెక్క, లవంగాలు: 3 చొప్పున
  • ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
  • పచ్చిమిర్చి: 2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
  • పసుపు పొడి: అర టీస్పూన్
  • కాశ్మీరీ చిల్లీ పౌడర్: 2 టీస్పూన్లు
  • ఉప్పు: 1 టీస్పూన్ (రుచికి సరిపడా)
  • మిరియాల పొడి: 1 టీస్పూన్
  • జీలకర్ర పొడి: 1 టీస్పూన్
  • ధనియాల పొడి: 1 టీస్పూన్
  • టమోటా: 1 (సన్నగా తరిగినది)
  • కరివేపాకు: తగినంత

తయారీ విధానం:
స్టెప్ 1: చికెన్ ఉడికించడం
ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడుక్కోవాలి. ఒక పాత్రలో తగినన్ని నీరు పోసి, అందులో చికెన్ ముక్కలు , రాయి ఉప్పు (రాక్ సాల్ట్) వేసి స్టవ్‌పై పెట్టాలి. మీడియం మంట మీద 15 నుండి 20 నిమిషాల పాటు చికెన్ ముక్కలు మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత ఆ ముక్కలను నీటి నుండి వేరు చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

స్టెప్ 2: చికెన్ ష్రెడ్డింగ్ (పీచుల్లా విడదీయడం)
ఉడికించిన చికెన్ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత, వాటిని చేత్తో చిన్న చిన్న పీచుల్లా (shredded chicken) విడదీసుకోవాలి. ఈ రెసిపీకి ఈ ప్రాసెస్ చాలా ముఖ్యం, దీనివల్ల మసాలాలన్నీ చికెన్‌కు బాగా పడతాయి.

స్టెప్ 3: పోపు , మసాలా తయారీ
ఇప్పుడు స్టవ్‌పై ఒక కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగాక సోంపు గింజలు, దాల్చినచెక్క, లవంగాలు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయలు దోరగా మారేంత వరకు వేయించుకోవాలి.

స్టెప్ 4: పొడి మసాలాలు జోడించడం
ఉల్లిపాయలు వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మంటను తగ్గించి పసుపు, కాశ్మీరీ కారం, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి , ధనియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసి మసాలాలన్నీ నూనెలో బాగా కలిసేలా కలపాలి.

స్టెప్ 5: ఫ్రైయింగ్..
ఇప్పుడు మనం ముందుగా పీచుల్లా విడదీసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఈ మసాలా మిశ్రమంలో వేయాలి. మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. చివరగా సన్నగా తరిగిన టమోటా ముక్కలు, కరివేపాకు వేసి మంటను హై ఫ్లేమ్‌లో (ఎక్కువ మంటపై) పెట్టి 5 నిమిషాల పాటు అడుగంటకుండా వేయించాలి.

టమోటాలు మెత్తబడి, చికెన్ ముక్కలు జ్యూసీగా, పొడిపొడిగా తయారయ్యాక స్టవ్ కట్టేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన, ఘాటైన ‘పిచి పొట్టా చికెన్’ రెడీ..! వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి, రసం వేసుకుని ఈ చికెన్ ఫ్రై నంచుకు తింటే ఆ రుచే వేరు.