Kerala Pepper Paneer Fry: నాన్‌వెజ్ తినని వాళ్లు ఎక్కువగా పన్నీర్‌ను ఇష్టపడుతుంటారు. రోజూ పన్నీర్‌తో రకరకాల వంటకాలు చేస్తుంటారు. షాహీ పన్నీర్, పన్నీర్ భుర్జీ, ఇంట్లో చేసే సాధారణ పన్నీర్ ఫ్రై కాకుండా ఈ సారి కొత్తగా ట్రై చేద్దాం. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ కేరళ పెప్పర్ పన్నీర్ తయారు చేద్దాం. ఈ పన్నీర్ ఫ్రై రుచి మాత్రమే కాదు.. వాసనలో సైతం సూపర్‌గా ఉంటుంది. కేరళ వంటల్లో ఎక్కువగా వాడే నల్ల మిరియాలు, కరివేపాకు, ఆవాలు, కొద్దిగా కొబ్బరి వేసి వండితే ఆహా అని లొట్టలేసుకుంటూ తినేస్తారు. ముఖ్యంగా మిరియాల తీపి-కారం కలిసిన రుచి ఈ వంటకు కొత్త రుచిని తెస్తుంది. మామూలు పన్నీర్ ఫ్రైలో ఉండే గరం మసాలా, జీలకర్ర వాసన ఇందులో కనిపించదు. బదులుగా, మిరియాల వేడి, కరివేపాకు పరిమళం కలిసి నోట్లోకి వెళ్లగానే కొత్త అనుభూతి ఇస్తాయి. ఆరోగ్య పరంగానూ ఈ వంటకం అద్భుతమనే చెప్పాలి. తక్కువ నూనె వాడతాం కాబట్టి తేలికగా జీర్ణమవుతుంది. పన్నీర్ వల్ల శరీరానికి మంచి ప్రోటీన్, కాల్షియం లభిస్తాయి. నల్ల మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి. అలాగే అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వల్ల శరీరానికి మేలు చేసే గుణాలు కలిగి ఉంటాయి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల, బరువు తగ్గాలనుకునేవాళ్లకూ ఇది సరైన వంటగా చెప్పొచ్చు.
READ MORE: Su-57E fighter jet: పాక్, చైనాలను వణికించే న్యూస్.. భారత్‌లోనే Su-57E ఫైటర్ జెట్ తయారీ..!
ఇప్పుడు వంట చేసే విధానం గురించి చూద్దాం. ముందుగా పన్నీర్ ముక్కలను ఒక గిన్నెలో వేసుకుని, దంచిన నల్ల మిరియాలు, కొద్దిగా కారం పొడి, పసుపు, ఉప్పు, నిమ్మరసం, కొంచెం నూనె వేసి మెల్లగా కలపాలి. పన్నీర్ ముక్కలు విరగకుండా జాగ్రత్తగా కలిపి, పది నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత బాణలిలో నెయ్యి లేదా నూనె వేడి చేసి, ఈ పన్నీర్ ముక్కలను వేసి, మధ్యస్థ మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అవి సిద్ధమయ్యాక పక్కన పెట్టాలి. మరో బాణలిలో మళ్లీ నెయ్యి లేదా నూనె వేడి చేసి, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, కావాలంటే టమాటా వేసి వేయించాలి. ఉల్లిపాయలు మెత్తగా, కొద్దిగా బంగారు రంగులోకి వచ్చాక, దంచిన మిరియాలు, ధనియాల పొడి, సోంపు పొడి, తగినంత ఉప్పు వేసి అర నిమిషం కలపాలి. ఇప్పుడు ముందుగా వేయించిన పన్నీర్ ముక్కలను ఇందులో వేసి బాగా కలపాలి. చివరగా కొంచెం కరివేపాకు, నెయ్యి చుక్కలు, ఇంకాస్త మిరియాల పొడి చల్లి, ఎక్కువ మంటపై ఒక నిమిషం ఉంచితే వంట సిద్ధం. ఈ కర్నీని రొట్టెలు, చపాతి, అన్నం ఇలా ఏ కామినేషన్‌లో అయినా తినొచ్చు. మళ్లీ మళ్లీ తినాలి అనిపించే రుచి ఇందులో దాగి ఉంది.
