Instant Onion Mixture: ఈ చిట్కా తెలిస్తే బయట ఫుడ్ అస్సలు కొనరు.. కేవలం 2 నిమిషాల్లో నోరూరుంచే స్నాక్ రెడీ!

Instant Onion Mixture

Instant Onion Mixture

Instant Onion Mixture: సాయంత్రం పూట ఏదైనా పుల్లగా, కారంగా, నోటికి రుచిగా తినాలనిపిస్తే.. పెద్దగా కష్టపడకుండా, ఇంట్లో ఉండే వాటితోనే కేవలం రెండు నిమిషాల్లో ఒక అద్భుతమైన స్నాక్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా. ఆ స్నాక్ మరేదో కాదు.. అదే నోరూరించే ‘ఉల్లి మిక్చర్’ (Ulli Mixture). ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు లేదా చల్లని సాయంత్రాల్లో ఈ స్నాక్ తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. బండి మీద దొరికే స్ట్రీట్ స్టైల్ రుచితో, ఎంతో హెల్తీగా ఇంట్లోనే దీనిని ఎలా రెడీ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

మందం అటుకులు (Thick Poha) – 1 కప్పు

వేరుశనగ గుళ్ళు (Peanuts) – పావు కప్పు

ఉల్లిపాయలు (పెద్దవి) – 2 (సన్నగా తరిగినవి)

ఉప్పు – రుచికి సరిపడా

కారం – 1 స్పూన్

పసుపు – చిటికెడు

ధనియాల పొడి – 1 స్పూన్

చాట్ మసాలా – 1 స్పూన్

కొత్తిమీర – కొద్దిగా (సన్నగా తరిగినది)

నెయ్యి – 1 స్పూన్

నిమ్మకాయ – 1

నూనె – వేయించడానికి సరిపడా

తయారీ విధానం..
ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే అటుకులు వేసి వేయించుకోవాలి (నూనె సరిగ్గా కాగకపోతే అటుకులు నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి, తెల్లగా పొంగవు). ఇక్కడ పల్చటి అటుకులు కాకుండా కాస్త మందంగా ఉండే అటుకులను మాత్రమే వాడాలి. చక్కగా పొంగిన అటుకులను తీసి, అదనపు నూనెను పీల్చుకోవడానికి టిష్యూ పేపర్ ఉన్న ఒక గిన్నెలో వేసుకోవాలి. అదే నూనెలో పావు కప్పు వేరుశనగ గుళ్ళు (పల్లీలు) కూడా వేసి, మాడిపోకుండా దోరగా వేయించి, వాటిని కూడా అటుకులు ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అటుకులు, పల్లీలను ఒకసారి పైకి కిందకి కదిపి, కింద ఉన్న టిష్యూ పేపర్‌ను తీసేయాలి.

ఇప్పుడు ఆ గిన్నెలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చాట్ మసాలా జల్లుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర, మిక్చర్‌కు మంచి ఫ్లేవర్, రుచిని అందించడం కోసం ఒక స్పూన్ నెయ్యి, ఒక నిమ్మకాయ రసాన్ని పూర్తిగా పిండుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ చేత్తో గట్టిగా కలుపుతూ ఉల్లిపాయల్లోని తడి అటుకులకు పట్టేలా బాగా కలపాలి. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒకసారి రుచి చూసి, మీ అవసరానికి తగినట్లుగా ఉప్పు, కారం లేదా పులుపును అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే.. ఎంతో రుచికరమైన, నోటికి పుల్లపుల్లగా కారకారంగా ఉండే హోమ్‌మేడ్ ఉల్లి మిక్చర్ రెడీ అయిపోయింది.

సాధారణంగా రోడ్డు పక్కన బండి మీద అమ్మేవాళ్ళు అయితే ఇందులో ఉడికించిన అరటికాయ ముక్కలు, మిర్చి బజ్జీ ముక్కలు లేదా టమాటా బజ్జీ ముక్కలను కూడా కట్ చేసి కలుపుతుంటారు. మీకు మరింత స్ట్రీట్ స్టైల్ రుచి కావాలనుకుంటే, ఇంట్లో బజ్జీలు ఉన్నప్పుడు వాటిని కూడా ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసి కలుపుకోవచ్చు. కానీ కేవలం ఇంట్లో ఉండే ఈ సింపుల్ ఇంగ్రిడియంట్స్‌తో చేసినా కూడా ఈ ఉల్లి మిక్చర్ అద్భుతమైన రుచిని ఇస్తుంది. కుదిరితే ఈరోజే మీ ఇంట్లో కూడా ప్రయత్నించి చూడండి.