Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!

Tandoori Roti Recipe

Tandoori Roti Recipe

Tandoori Roti Recipe: తందూరీ రోటీ అంటే చాలా మందికి ధాబాలు, రెస్టారెంట్ల రుచి వెంటనే గుర్తుకొస్తుంది. బయట భోజనం చేయడానికి వెళ్లినప్పుడు తందూరీ రోటీని ప్రత్యేకంగా ఆర్డర్ చేసే వారు కూడా చాలామందే ఉంటారు. కరకరలాడే పైపొర, స్వల్పంగా పొగ వాసన వచ్చే రుచి, వెన్న లేదా నెయ్యితో కలిసిన ఆ ఫ్లేవర్ భోజనానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. అయితే ఇలాంటి ధాబా స్టైల్ తందూరీ రోటీని ఇంట్లో తయారు చేయాలంటే తందూర్ లేదా ఓవెన్ తప్పనిసరిగా అవసరమని చాలామంది భావిస్తారు.

కానీ ఇప్పుడు కేవలం ఒక ఇనుప పెనం సహాయంతోనే ఇంట్లో రుచికరమైన తందూరీ రోటీని సులభంగా తయారు చేసుకోవచ్చు. సరైన విధంగా చేస్తే ఈ రోటీలు కూడా ధాబాలో దొరికే రుచిని ఇస్తాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, పిల్లలు ఈ రుచిని ఎంతో ఇష్టపడతారు. అంటే.. తందూర రోటీ కావాలంటే ధాబాకు వెళ్లాల్సిన అవసరం లేదు.. రెస్టారెంట్‌ నుంచి ఆర్డర్‌ పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..

కావలసిన పదార్థాలు
* 2 కప్పుల గోధుమ పిండి
* 3 నుంచి 4 టీస్పూన్ల పుల్లటి పెరుగు
* అర టీస్పూన్ బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్
* 1 టీస్పూన్ చక్కెర
* 1 టీస్పూన్ నూనె
* తగినంత ఉప్పు
* అవసరమైనంత నీరు
* నెయ్యి లేదా వెన్న
* కొత్తిమీర ఆకులు లేదా నల్ల జీలకర్ర (ఐచ్ఛికం)

తయారీ విధానం
* ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి తీసుకుని అందులో పుల్లటి పెరుగు, బేకింగ్ సోడా, చక్కెర, ఉప్పు వేసి బాగా కలపాలి.
* ఆ తరువాత కొద్దికొద్దిగా నీరు పోస్తూ మెత్తగా పిండి కలపాలి. పిండి సిద్ధమైన తర్వాత ఒక టీస్పూన్ నూనె రాసి ముద్దపై సమంగా పరచాలి.
* ఇప్పుడు ఆ పిండిని తడి గుడ్డతో కప్పి కనీసం అరగంట పాటు పక్కన ఉంచాలి. దీంతో పిండి మెత్తబడటంతో పాటు రోటీ మరింత మృదువుగా వస్తుంది.
* అరగంట తరువాత పిండిలోంచి చిన్న గడ్డ తీసుకుని చపాతీలా కొద్దిగా మందంగా ఒత్తాలి. కావాలంటే పైన కొత్తిమీర లేదా నల్ల జీలకర్ర చల్లుకోవచ్చు.
* ఇప్పుడు ఇనుప పెనాన్ని బాగా వేడి చేయాలి. రోటీ వెనుక భాగానికి కొద్దిగా నీరు రాసి, ఆ తడి భాగాన్ని పెనం మీద జాగ్రత్తగా అతికించాలి. కొద్దిసేపటికి రోటీపై బుడగలు రావడం మొదలవుతుంది.
* ఆ తరువాత పెనాన్ని తలక్రిందులుగా చేసి నేరుగా గ్యాస్ మంటపై తిప్పుతూ కాల్చాలి. రోటీపై గోధుమరంగు మచ్చలు వచ్చేవరకు బాగా కాల్చితే ధాబా స్టైల్ తందూరీ రోటీ సిద్ధమైనట్టే.
* చివరగా రోటీపై నెయ్యి లేదా వెన్న రాసి వేడి పప్పు, పనీర్ కర్రీ లేదా చికెన్ కర్రీతో వడ్డిస్తే అద్భుతమైన రుచి వస్తుంది. ఇకపై తందూరీ రోటీ కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే రెస్టారెంట్ రుచిని ఆస్వాదించవచ్చు.