NTV Telugu Site icon

Health Tips: కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఈ ఫుడ్ తినకూడదు

Pains

Pains

వివిధ ఆరోగ్య కారణాలు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, జన్యు పరిస్థితుల వల్ల చాలామందికి కీళ్ళ నొప్సులు వస్తుంటాయి. కీళ్లనొప్పులని వైద్య భాషలో ఆర్థరైటిస్ అని పిలుస్తారు. ఇది చాలా సాధారణ ఆరోగ్య సమస్య. పెరుగుతున్న వయస్సుతో, ఎముకలు బలహీనపడటం ప్రారంభించినప్పుడు వెంటనే దానికి సరైన పరిష్కారం ఆలోచించాలి.

వృద్ధాప్యం, కండరాల బలహీనత, ఊబకాయం, అనేక ఇతర కారణాల వల్ల ప్రజలు ఆర్థరైటిస్ సమస్యలను కలిగి ఉంటారు. మనం తాగే నీరు వల్ల కూడా కొన్ని రకాల కీళ్ళ నొప్పులు కలుగుతుంటాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధి. ఇది నెమ్మదిగా పెరుగుతుంది. పూర్తిగా వదిలించుకోవటం అనేది అసాధ్యం. వాపు, నొప్పి వంటి సమస్యలను సరైన ఆహారాలు తినడం ద్వారా తగ్గించుకోవచ్చు. ఇవి వుంటే అసలు మనం సరిగా పనిచేయలేం. ఏకాగ్రత దెబ్బతింటుంది. ఆర్థరైటిస్ సమస్య ఎదిగే వయసులో ఎవరికైనా రావచ్చు. అయితే ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో మహిళలు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అవసరం.

ఏం తినకూడదు?

* మీరు ఆర్థరైటిస్ నొప్పితో బాధపడుతుంటే ప్రాసెస్ చేసిన రెడ్ మీట్‌ని దూరం పెట్టండి. రెడ్ మీట్ అనేది శరీరంలో మంటను పెంచుతుంది. దీని కారణంగా మీకు మరింత నొప్పి, వాపుతో బాధపడాల్సి వస్తుంది. ఇందులో శరీరానికి ముఖ్యంగా గుండెకు హానికారకమయిన చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మీరు వాపు సమస్యలు తలెత్తుతాయి. రెడ్ మీట్ మానేసాక మీలో కలిగే మార్పుని మీరు గమనించవచ్చు.

* కీళ్ళ నొప్పులతో బాధపడేవారు తీయని పానీయాలకి దూరంగా ఉండాలి. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్య మరింత జఠిలమవుతుంది. అధిక చక్కెర వినియోగం గుండె జబ్బులతో మరణించే ప్రమాదాన్ని కూడా పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఊబకాయం, వాపు, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక నొప్పులకి కారణమవుతుంది. మీకు బాగా స్వీట్స్ తినే అలవాటుంటే వెంటనే మానేయండి. మీ కీళ్ళనొప్పులు తగ్గుతాయి.

* ఫాస్ట్ ఫుడ్, కాల్చిన ఆహారం, వేపుళ్ళు మానేయాలి. ఇవి కీళ్ల నొప్పులని మరింత పెంచుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య పెరుగుతుంది. ఇది మీ కీళ్లపై అదనపు భారం వేసి నొప్పిని మరింత పెంచుతుంది. నిల్వ వుండడానికి వాడే ప్రిజర్వేటివ్స్ వల్ల కూడా కీళ్ళ నొప్పులు కలుగుతాయి.

* ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలి. అధిక ఉప్పు ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని గ్రహించండి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు ఎక్కువ ఉప్పు తీసుకోవడం హానికరం. రొయ్యలు, క్యాన్డ్ సూప్, పిజ్జా, ప్రాసెస్ చేసిన మాంసం వంటి వాటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవద్దు. పెరుగు తినేటప్పుడు ఉప్పు వాడడం తగ్గించండి. వీలైతే మొత్తం మానేయండి. ఆహారంలో మార్పులు చేసుకుంటూ వైద్యనిపుణుల సలహాలు, సూచనలు, మందులు వాడితే నిత్యం బాధించే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Weight Loss: ఈ డ్రింక్స్ తాగితే బరువు ఈజీగా తగ్గుతారు