Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!

  • ఉల్లి, వెల్లుల్లి లేకుండా రుచికరమైన గుజరాతీ వంటకం
  • దాల్ డోక్లీకి కావలసిన పదార్థాలు ఇవే
  • సాఫ్ట్ డోక్లీ తయారీలో ఈ టిప్స్ ఫాలో అవ్వండి
  • వేడివేడిగా నెయ్యితో తింటే రుచి డబుల్

Dal Dhokli Recipe : భారతీయ వంటకాల్లో గుజరాతీ వంటకాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా వారు చేసే వంటకాల్లో తీపి, కారం, పులుపుల కలయిక నాలుకకు కొత్త రుచిని అందిస్తుంది. అలాంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాల్లో ‘దాల్ డోక్లీ’ (Dal Dhokli) అత్యంత ప్రజాదరణ పొందింది. కందిపప్పు రసంలో గోధుమ పిండితో చేసిన ముక్కలను ఉడికించి తయారుచేసే ఈ వంటకం కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వర్షం పడేటప్పుడు లేదా చలికాలంలో వేడివేడిగా ఈ దాల్ డోక్లీని తింటే ఆ మజానే వేరు. లంచ్ లేదా డిన్నర్‌లోకి వన్-పాట్ మీల్‌లా చేసుకోగలిగే ఈ టేస్టీ రెసిపీ తయారీ విధానం , కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

  • దాల్ (పప్పు) కోసం:
  • కందిపప్పు (Toor Dal): అర కప్పు (కనీసం 1 గంట ముందు నానబెట్టుకోవాలి)
  • పసుపు: పావు టీస్పూన్ 
  • ఇంగువ: చిటికెడు 
  • ఉప్పు: అర టీస్పూన్ 
  • వేరుశెనగ గుళ్లు: 1 టేబుల్ స్పూన్ 
  • నీళ్లు: 2 కప్పులు 
  • పోపు (తాలింపు) కోసం: 
  • నూనె , నెయ్యి: తగినంత
  • ఆవాలు, జీలకర్ర: ఒక్కో టీస్పూన్
  • ఎండు మిర్చి: 2
  • పచ్చి మిర్చి: 2 (చీలికలు)
  • కరివేపాకు: కొన్ని రెబ్బలు
  • టమాటాలు: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
  • పొడి మసాలాలు: పసుపు (పావు tsp), కారం (1 tsp), ధనియాల పొడి (1 tsp), ఉప్పు (అర tsp)
  • బెల్లం తురుము: రుచికి తగినంత

 

డోక్లీ (బిళ్లల) కోసం:

  • గోధుమ పిండి: 1 కప్పు
  • మసాలాలు: పసుపు (చిటికెడు), కారం (అర tsp), జీలకర్ర పొడి (అర tsp), ఉప్పు (పావు tsp), వాము (అర tsp)
    నూనె: 2 టీస్పూన్లు

తయారీ విధానం:
1. దాల్ (పప్పు) ఉడికించడం:
ముందుగా గంటసేపు నానబెట్టుకున్న కందిపప్పును బాగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో వేయాలి. అందులో పావు టీస్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ, అర టీస్పూన్ ఉప్పు, వేరుశెనగ గుళ్లు , రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి. కుక్కర్ ను స్టవ్‌పై ఉంచి మీడియం మంట మీద 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకుని పక్కన పెట్టుకోవాలి.

2. కమ్మని తాలింపు:
ఇప్పుడు స్టవ్‌పై ఒక వెడల్పాటి బాణలి (కడాయి) పెట్టి అందులో నూనె , నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత ఎండు మిర్చి, పచ్చి మిర్చి చీలికలు, కరివేపాకు, , కొద్దిగా ఇంగువ వేసి వేయించాలి. పోపు వేగాక సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేయాలి. దాంతోపాటే పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి టమాటా ముక్కలు బాగా మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు, ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని ఇందులో పోసి బాగా కలపాలి. ఈ పప్పును 5 నిమిషాల పాటు మరిగించి, చివరగా గుజరాతీ టచ్ కోసం కొద్దిగా బెల్లం తురుము వేసి కలపాలి.

3. సాఫ్ట్ డోక్లీ తయారీ:
పప్పు మరుగుతున్న సమయంలో మనం డోక్లీలను సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అందులో పసుపు, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, నూనె , వామును చేత్తో నలిపి వేసుకోవాలి (వాము వేయడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది). ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కాస్త మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిపై తడి గుడ్డ లేదా మూత పెట్టి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీ పీటపై పొడి పిండి చల్లుకుంటూ పూరీ లేదా చపాతీలా పల్చగా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న చపాతీని చాకుతో డైమండ్ (కాజు బర్ఫీ) ఆకారంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

4. దాల్ డోక్లీల కలయిక:
ఇప్పుడు మరుగుతున్న పప్పు చారులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి డోక్లీ ముక్కలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయాలి. అన్నీ ఒకేసారి వేస్తే ముద్దగా అయిపోయే ప్రమాదం ఉంది. ముక్కలన్నీ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి. గోధుమ పిండి ముక్కలు పప్పు రసాన్ని పీల్చుకుని మెత్తగా ఉడికి పైకి తేలుతాయి. అప్పుడు పప్పు కూడా కాస్త చిక్కబడుతుంది.

చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ కట్టేయాలి. అంతే వేడివేడి, పుల్లపుల్లగా, తీతీగా ఉండే సాంప్రదాయ గుజరాతీ ‘దాల్ డోక్లీ’ సిద్ధం.. దీనిని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని, వడ్డించే ముందు పైనుంచి కొద్దిగా నిమ్మరసం పిండుకుని, ఒక చెంచా నెయ్యి వేసుకుని తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. సైడ్ డిష్‌గా కాస్త ఉల్లిపాయ ముక్కలు, నంజుకోవడానికి పాపడ్ ఉంటే ప్లేట్ ఖాళీ అయిపోవాల్సిందే..