Homemade Recipes: రొటీన్ పచ్చళ్లు బోర్ కొట్టాయా? ఈ పచ్చడి ట్రై చేయండి.. ఒక్క ముద్ద తిన్నా వదిలిపెట్టరు!

Andhra Style Green Chilli Chutney Recipe

Andhra Style Green Chilli Chutney Recipe

Homemade Recipes: రోజూ తినే టమాటా, కొత్తిమీర, పుదీనా పచ్చళ్లు తిని నాలుకకు రుచి మొద్దుబారినట్లు అనిపిస్తోందా? అయితే ఒక్కసారి ఆంధ్రా స్టైల్‌లో నోరూరించే ఈ స్పెషల్ ‘పచ్చిమిర్చి పచ్చడి’ రుచి చూడాల్సిందే. ఘాటుగా, పుల్లగా, కమ్మగా ఉండే ఈ రోటి పచ్చడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే అన్నంలోకి వేరే ఏ కూర కూడా అవసరం లేదు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఈ పచ్చడి కలిపి తింటే.. ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇడ్లీ, దోశ, చపాతీల్లోకి కూడా ఇది అదిరిపోయే కాంబినేషన్‌గా పని చేస్తోంది. ఈ పచ్చడి సింపుల్‌గా ఎలా రెడీ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

* తక్కువ కారముండే పచ్చిమిర్చి – 200 గ్రాములు

* మెంతులు – అర టీస్పూన్

* ధనియాలు – 1 టేబుల్ స్పూన్

* జీలకర్ర – 1 టీస్పూన్

* నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు

* చింతపండు – నిమ్మకాయంత (నానబెట్టినది)

* బెల్లం తురుము – 1 టేబుల్ స్పూన్

* వెల్లుల్లి రెబ్బలు – 5 నుంచి 6

* ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)

* ఉప్పు, నూనె – సరిపడా

పోపు కోసం:

* ఆవాలు, జీలకర్ర – ఒక్కో టీస్పూన్

* పచ్చిశనగపప్పు, మినప్పప్పు – ఒక్కో టేబుల్ స్పూన్

* ఇంగువ – పావు టీస్పూన్

* ఎండుమిర్చి – 2

* కరివేపాకు, పసుపు, కొత్తిమీర – తగినంత

తయారీ విధానం:

ముందులో ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి మెంతులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి సన్నని మంటపై దోరగా వేయించి పక్కన పెట్టండి. తర్వాత అదే బాండీలో పచ్చిమిర్చి ముక్కలను వేసి కలిపి, మూతపెట్టి 5 నిమిషాల పాటు మెత్తబడే వరకు మగ్గనిచ్చి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుని.. నానబెట్టిన చింతపండు, బెల్లం, వెల్లుల్లి, సరిపడా ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఇందులో కలపాలి. మరో పాన్‌లో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు తాలింపులో రుబ్బుకున్న పచ్చడిని వేసి బాగా కలిపి, పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే ఘుమఘుమలాడే అసలైన ఆంధ్ర స్టైల్ పచ్చిమిర్చి పచ్చడి రెడీ.

పర్ఫెక్ట్ టేస్ట్ కోసం ఈ టిప్స్ పాటించండి..

* మరీ కారంగా ఉండే పచ్చిమిర్చి కాకుండా కాస్త తక్కువ కారం ఉన్నవాటిని ఎంచుకుంటే పచ్చడి అదిరిపోతుంది.

* పచ్చడిని పేస్టులా కాకుండా కచ్చాపచ్చాగా నూరితేనే ప్రతి ముద్దలోనూ పచ్చిమిర్చి క్రంచీ ఫ్లేవర్ తెలుస్తుంది.

* ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలను ముందే కలపకుండా, తినేటప్పుడు విడిగా కలుపుకుంటే తాజాగా ఉంటుంది.

పచ్చిమిర్చి పచ్చడితో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:

ఈ పచ్చడి కేవలం నోటికి రుచిని మాత్రమే కాకుండా, ఇందులో ఉపయోగించే పదార్థాల వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

* ఈ పచ్చిమిర్చిలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

* తాలింపులో వాడే జీలకర్ర, మెంతులు, ఇంగువ, వెల్లుల్లి జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి, కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తాయి.

* పచ్చడిలో వాడే నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

* పచ్చిమిర్చిలో ఉండే ‘క్యాప్సైసిన్’ శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచి, క్యాలరీలు వేగంగా ఖర్చయ్యేలా చేయడంలో తోడ్పడుతుంది.

* వెల్లుల్లి రక్తపోటును నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

* మెంతులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహకరిస్తాయి.

* ఇందులో వాడే బెల్లంలో సహజమైన ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా కాపాడుతుంది.

నోట్: అల్సర్లు లేదా తీవ్రమైన ఎసిడిటీ ఉన్నవారు కారాన్ని కాస్త మితంగా తీసుకోవడం మంచిది.