Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!

Andhra Style Amla Pickle

Andhra Style Amla Pickle

Andhra Style Amla Pachadi Recipe: ఉసిరికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం తెలిసిందే. ఇందులో విటమిన్ ‘సి’ విరివిగా లభిస్తుంది. చాలామంది ఉసిరికాయను మురబ్బాగానో, ఊరగాయగానో తింటుంటారు. కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఉసిరికాయతో ఎంతో ప్రత్యేకంగా ఓ రుచికరమైన పచ్చడి చేసుకుంటారు. కాస్త పుల్లగా, కారకారంగా, మసాలా దినుసుల పరిమళంతో ఉండే ఈ పచ్చడి రోజూ తినే అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. బోరింగ్ ఫుడ్‌కి మంచి రుచిని అందించే ఈ ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

ఉసిరికాయలు – 500 గ్రాములు
నువ్వుల నూనె – అర కప్పు (మరియు వేయించడానికి 2 పెద్ద స్పూన్లు)
ఆవాలు – 2 పెద్ద స్పూన్లు
మెంతులు – 1 పెద్ద స్పూన్
కారం – పావు కప్పు
ఉప్పు – 3 నుంచి 4 పెద్ద స్పూన్లు (రుచికి సరిపడా)
పసుపు – అర చిన్న స్పూన్
నిమ్మరసం – 2 నిమ్మకాయల రసం (ఇష్టమైతే)

తాలింపు కోసం:

ఆవాలు – అర చిన్న స్పూన్
జీలకర్ర – అర చిన్న స్పూన్
ఇంగువ – చిటికెడు
ఎండుమిర్చి – 1
వెల్లుల్లి రెబ్బలు – కొద్దిగా (కావాలంటే)

తయారీ విధానం:

మందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, తడిలేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 పెద్ద స్పూన్ల నువ్వుల నూనె వేసి, ఉసిరికాయలను మీడియం మంటపై 8 నుంచి 10 నిమిషాల పాటు వేయించాలి. ఉసిరికాయలు మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. కావాలంటే గింజలు తొలగించి ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే పొడి కడాయిలో 1 పెద్ద స్పూన్ ఆవాలు, 1 పెద్ద స్పూన్ మెంతులు వేసి తేలికగా వేయించాలి. మంచి సువాసన రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక పొడి గిన్నెలో కారం, ఉప్పు, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న ఆవాలు-మెంతుల పొడి వేయాలి. ఇందులో చల్లారిన ఉసిరికాయలను వేసి, ప్రతి ముక్కకూ మసాలా బాగా పట్టేలా కలపాలి. ఇప్పుడు మిగిలిన నువ్వుల నూనెను వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఆవాలు చిటపటలాడాక ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. తాలింపు నూనె పూర్తిగా చల్లారిన తర్వాత, దీన్ని ఉసిరికాయ మిశ్రమంలో కలపాలి. కావాలనుకుంటే ఈ సమయంలో నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ పచ్చడిని తయారు చేసిన తర్వాత శుభ్రంగా, పూర్తిగా పొడిగా ఉన్న గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. మసాలాల రుచి ఉసిరికాయ ముక్కలకు బాగా పట్టడానికి, రెండు రోజుల తరువాత నుంచి దీన్ని తినడం మంచిది.