Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!

  • రోజూ తుడిచినా నేల ఎందుకు జిగటగా మారుతుంది?
  • ఉప్పు, బేకింగ్ సోడాతో మొండి మురికి మాయం
  • నిమ్మ, వెనిగర్, వేప నీటితో సహజసిద్ధ క్లీనింగ్
  • నేల ఎప్పుడూ మెరవాలంటే పాటించాల్సిన టిప్స్
Floor Cleaning

Floor Cleaning

Floor Cleaning Tips : ఇల్లు చిన్నదైనా శుభ్రంగా ఉంచుకోవాలి అనేది మనం చిన్నప్పటి నుండి వింటూ వస్తున్న ఒక మంచి నానుడి. ఇల్లు, మనసు రెండూ శుభ్రంగా ఉన్న చోట సంతోషం, ప్రశాంతత వాటంతట అవే వెల్లురుస్తాయి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో ముఖ్యం. వంటగది అరలను సర్దడం నుండి ఇల్లు ఊడ్చి, నేలను తుడవడం వరకు కొన్ని సాధారణ చిట్కాలను పాటిస్తే ఇల్లు అందంగా కనిపించడమే కాకుండా వ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చు.

రోజువారీ క్లీనింగ్ ఎందుకు సరిపోదు?

చాలా ఇళ్లలో ప్రతిరోజూ నేలను శుభ్రం చేసినప్పటికీ, అది కళావిహీనంగా, జిగటగా కనిపిస్తుంటుంది. దానికి కారణం.. మనం రోజూ నడుస్తున్నప్పుడు బూట్ల వల్ల వచ్చే మురికి, వంటగది జిడ్డు, దుమ్ము , ఆహార కణాలు నేలపై ఒక పలుచని పొరలా పేరుకుపోతాయి. కేవలం సాధారణ నీటితో తుడవడం వల్ల ఈ మురికి పూర్తిగా తొలగిపోకుండా అంతటా విస్తరిస్తుంది. అలాగే టీ, కాఫీ లేదా ఇతర పదార్థాలు ఒలికినప్పుడు వెంటనే క్లీన్ చేయకపోతే, అవి ముదురు మరకలుగా మారి నేల మెరుపును తగ్గిస్తాయి. రసాయనాలతో కూడిన డిటర్జెంట్లు వాడినా కొన్నిసార్లు ఫలితం ఉండదు. అందుకే వారానికి ఒకసారైనా నేలను డీప్ క్లీనింగ్ (లోతుగా శుభ్రం) చేయడం అవసరం.

×
×
Ad

ఉప్పు, బేకింగ్ సోడాతో పొడి స్క్రబ్బింగ్

నేలపై పేరుకుపోయిన గట్టి మురికిని వదిలించడానికి రాతి ఉప్పు (కల్లుప్పు) , బేకింగ్ సోడాలను సమాన భాగాలుగా కలిపి నేలపై చల్లాలి. ఆ తర్వాత ఒక గట్టి లేదా పాత మాప్‌తో నేలను పొడిగా రుద్దాలి. ఉప్పులో ఉండే గరుకుదనం మొండి మురికిని వదిలిస్తే, బేకింగ్ సోడా నూనె , జిడ్డు అవశేషాలను పీల్చుకుంటుంది. ఇలా పొడిగా రుద్దిన తర్వాత, వదులైన దుమ్ము, మురికి అంతా పోయేలా ఇల్లాంత గట్టిగా ఊడ్చేయాలి.

నిమ్మరసంతో క్రిమిసంహారక రక్షణ

నిమ్మకాయలు ఆరోగ్యానికే కాకుండా ఇంటి పనులకు కూడా ఎంతో మేలు చేస్తాయి. నిమ్మకాయల్లో ఉండే సహజ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నేలపై ఉండే క్రిములను సమర్థవంతంగా నాశనం చేస్తాయి. ఒక బకెట్ నీటిలో రెండు నిమ్మకాయల రసాన్ని పిండి, ఆ నీటితో నేలను తుడవడం వల్ల ఇల్లు శుభ్రపడటమే కాకుండా, గది అంతటా నిమ్మకాయల తాజా సువాసన వ్యాపించి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

మొండి జిడ్డుకు తెల్ల వెనిగర్

జిడ్డు మరకలను తొలగించడంలో తెల్ల వెనిగర్ (White Vinegar) అద్భుతంగా పనిచేస్తుంది. ఒక బకెట్ నీటిలో ఒక కప్పు తెల్ల వెనిగర్ కలిపి నేలను తుడవడం వల్ల మురికి త్వరగా వదిలిపోతుంది. అయితే, మార్బుల్స్ (రాతి నేలలు) లేదా గ్రానైట్ ఫ్లోరింగ్ ఉన్నవారు వెనిగర్ వాడకపోవడం మంచిది, ఎందుకంటే ఇందులోని ఆమ్ల గుణం ఆయా నేలల సహజత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.

కీటకాలను తరిమికొట్టే వేప నీరు

ప్రాచీన కాలం నుండి వేపను అత్యుత్తమ క్రిమిసంహారకంగా వాడుతున్నారు. కొన్ని వేప ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటిని ఇల్లు తుడిచే బకెట్ నీటిలో కలపాలి. లేదా నేరుగా 10-15 చుక్కల వేప నూనెను నీటిలో కలిపి కూడా నేలను తుడవవచ్చు. ఇలా చేయడం వల్ల నేల క్లీన్ అవ్వడమే కాకుండా, ఇంట్లోకి వచ్చే బొద్దింకలు, చీమలు , ఇతర కీటకాలు దరిచేరకుండా దూరంగా పారిపోతాయి.

పటిక , డిటర్జెంట్ లిక్విడ్ వాడకం

నేలపై ఉన్న జిగురును వదిలించడానికి పటిక (Alum) పొడి బాగా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా పటిక పొడిని కలిపి, ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ నీటితో నేలను తుడవాలి. ఇది జిగురును పూర్తిగా వదిలిస్తుంది. అలాగే వంటగది సమీపంలో జిడ్డు ఎక్కువగా ఉంటే, ఒక బకెట్ నీటిలో 1-2 టేబుల్ స్పూన్ల డిష్‌వాషింగ్ లిక్విడ్ లేదా తేలికపాటి హెర్బల్ క్లీనర్‌ను కలిపి తుడవడం ద్వారా నేలకు మంచి మెరుపు వస్తుంది.

నేల జిగటగా మారకుండా ఉండాలంటే ఇవి పాటించండి:

గోరువెచ్చని నీరు: ఇల్లు తుడవడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించడం వల్ల నేలపై ఉండే జిగట అవశేషాలు త్వరగా కరిగిపోతాయి.

నీటిని మార్చడం: చాలామంది ఇల్లంతా ఒకే బకెట్ నీటితో తుడిచేస్తుంటారు. దీనివల్ల మురికి వదలడానికి బదులు అంతటా పేరుకుపోతుంది. అందువల్ల ఇల్లు తుడిచేటప్పుడు మధ్యలో కనీసం రెండు మూడు సార్లు బకెట్ నీటిని మార్చడం అలవాటు చేసుకోవాలి.

పొడి గుడ్డతో తుడుపు: తడి గుడ్డతో ఇల్లు తుడిచిన వెంటనే, ఒక పొడి గుడ్డతో నేలపై మరోసారి తుడవడం వల్ల జిగురు ఏర్పడకుండా ఉంటుంది.

మాప్‌లను మార్చడం: ఒకే మాప్ (Mop)ను చాలా కాలం పాటు ఉపయోగించకూడదు. అరిగిపోయిన మాప్ సరిగ్గా క్లీన్ చేయలేదు సరే కదా, పైగా దుర్వాసన వస్తుంది. కాబట్టి వాటిని క్రమ తప్పకుండా మారుస్తూ ఉండాలి.

(గమనిక: ఈ వ్యాసంలో అందించిన సమాచారం కేవలం సాధారణ అవగాహన , గృహ చిట్కాల కోసం మాత్రమే.)