టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు, వాహనదారుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ (FASTag) విధానాన్ని పూర్తిగా తప్పనిసరి చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా టోల్ గేట్ల వద్ద నగదు రహిత లావాదేవీలను వంద శాతం ప్రోత్సహించేందుకు ఇటీవల కేంద్రం నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధించింది. ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ (UPI) ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలామంది వాహనదారులకు ఒక ముఖ్యమైన సందేహం వస్తుంటుంది. ఒకవేళ టోల్ గేటు వద్దకు వెళ్ళిన తర్వాత ఫాస్టాగ్ సరిగ్గా పనిచేయకపోతే ఏం చేయాలి, అసలు ఆ సమస్యలు ఎందుకు వస్తాయి అనే విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం.
ఫాస్టాగ్ సరిగ్గా స్క్యాన్ అవ్వకపోవడానికి గల కారణాలు
మనం ప్రయాణించే వాహనాల విండ్ షీల్డ్ (ముందు అద్దం)ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే కొంతమంది విండ్ షీల్డ్‌ను క్లీన్ చేసేటప్పుడు ఫాస్టాగ్ ఉన్న ప్రాంతాన్ని గట్టిగా రుద్దేస్తుంటారు. దీనివల్ల అందులో ఉండే ఆర్‌ఎఫ్‌ఐడీ (RFID) చిప్ దెబ్బతిని, టోల్ గేట్ల వద్ద ఉండే స్కానర్లు దానిని రీడ్ చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. అలాగే విపరీతమైన ఎండ, దుమ్ము, ధూళి లేదా భారీ వర్షం పడే సమయాల్లో కూడా స్కానర్లు ఈ చిప్‌ను సరిగ్గా గుర్తించలేవు. వీటితో పాటు చాలా ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్న పాత ఫాస్టాగ్‌లు సరిగ్గా పనిచేయవు. ముఖ్యంగా ఐదేళ్లకు పైబడి ఒకే ఫాస్టాగ్‌ను వాడుతుంటే అది పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. కాబట్టి టోల్ ప్లాజాల వద్ద తరచుగా స్కానింగ్ సమస్యలు వస్తుంటే ఆ ట్యాగ్‌ను మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని గ్రహించాలి.
సమస్య తలెత్తితే వాహనదారులు ఏం చేయాలి?
మీరు ప్రయాణించే సమయంలో ఫాస్టాగ్ వల్ల తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మొదట మీకు ఆ ఫాస్టాగ్‌ను జారీ చేసిన బ్యాంకు లేదా సంబంధిత ఏజెన్సీని సంప్రదించాల్సి ఉంటుంది. పాత ట్యాగ్ స్థానంలో కొత్త ఫాస్టాగ్‌ను రీప్లేస్ చేసుకోవడం ద్వారా ఈ స్కానింగ్ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. కొత్త ట్యాగ్ తీసుకోవడం వల్ల టోల్ గేట్ల వద్ద ఎలాంటి ఆలస్యం లేకుండా స్కానర్లు వెంటనే రీడ్ చేస్తాయి. ఒకవేళ అత్యవసర ప్రయాణంలో ట్యాగ్ రీడ్ అవ్వకపోతే అక్కడ అందుబాటులో ఉండే యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ ఆప్షన్ ద్వారా టోల్ ఫీజు చెల్లించి ముందుకు సాగవచ్చు.
ఫాస్టాగ్ విషయంలో చేయకూడని పొరపాట్లు ఇవే.!
వాహనదారులు తమ కారు ముందు అద్దంపై ఫాస్టాగ్ ఉన్న భాగాన్ని ఎప్పుడూ గట్టిగా రుద్దకూడదు. ఒకసారి అతికించిన ఫాస్టాగ్‌ను పదే పదే తీసి మళ్లీ అతికించడం, దానిని వంచడం లేదా ముడతలు పడేలా చేయడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల లోపల ఉండే సర్క్యూట్ కనెక్టివిటీ దెబ్బతింటుంది. అలాగే విండ్ షీల్డ్‌పై ఉన్న ఫాస్టాగ్‌ను కప్పి ఉంచేలా ఎలాంటి ఇతర సన్ ప్రొటెక్షన్ ఫిల్మ్‌లు, రంగుల స్టిక్కర్లు లేదా డెకరేటివ్ పేపర్లు అంటించకూడదు. వీటిని నివారించడం ద్వారా మీ ఫాస్టాగ్ ఎక్కువ కాలం మన్నికగా పనిచేస్తుంది , టోల్ ప్లాజాల వద్ద మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది.
