Potato Snacks: సాయంత్రం వేళ వేడివేడిగా ఏదైనా స్పైసీగా తినాలనిపించినా.. పండుగల వేళ స్వీట్లు ఎక్కువగా తిని నాలుక మొద్దుబారినా.. వెంటనే గుర్తొచ్చేది రోడ్డు పక్కన బండి మీద దొరికే కరకరలాడే పకోడీలే. బయట క్రిస్పీగా ఉంటూ, లోపల నోట్లో వెన్నలా కరిగిపోయే ఆ బండి మీద బజ్జీలు, పకోడీల రుచి ఇంట్లో ఎందుకు రాదు అని చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ వంటసోడా లాంటివి వాడకుండానే, స్ట్రీట్ స్టైల్ కంటే పది రెట్లు ఎక్కువ రుచితో ఇంట్లోనే ఈజీగా ఆలూ-ఉల్లిపాయ పకోడీలను తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
* బంగాళాదుంపలు: 2-3 (సన్నగా గుండ్రంగా లేదా పొడవుగా తరిగిన ముక్కలు)
* ఉల్లిపాయలు: 2 (సన్నని పొడవాటి ముక్కలు)
* శనగపిండి: ఒకటిన్నర కప్పు
* పచ్చిమిర్చి: 3-4 (సన్నగా తరిగినవి)
* కొత్తిమీర తరుగు: కొద్దిగా
* వాము, జీలకర్ర: అర చెంచా చొప్పున
* కారం, పసుపు, ఆమ్చూర్ పొడి: అర చెంచా చొప్పున
* గరం మసాలా, ఇంగువ: చిటికెడు చొప్పున
* ఉప్పు: రుచికి తగినంత
* నూనె: వేయించడానికి సరిపడా
బండి మీద మాస్టర్ సీక్రెట్ ట్రిక్స్ ఇవే..
* పిండిని గిలక్కొట్టడం: శనగపిండిలో మసాలాలు, తగినన్ని నీళ్లు పోసి కలుపుతున్నప్పుడు చేతితో కనీసం 4 నుంచి 5 నిమిషాల పాటు ఒకే డైరెక్షన్లో గిలక్కొట్టాలి. దీనివల్ల పిండిలోకి సహజంగానే గాలి చేరి, వంటసోడా వేయకపోయినా పకోడీలు నూనెలో పడగానే గుల్లగా, దూదిలా పొంగుతాయి.
* కాగే నూనె చుక్క: పిండి కలిపిన తర్వాత, స్టవ్ మీద కాగుతున్న నూనె నుంచి ఒక టేబుల్ స్పూన్ మరుగుతున్న వేడి నూనెను తీసి శనగపిండి మిశ్రమంలో కలపాలి. ఈ ఒక్క చిన్న చిట్కాతో పకోడీలు గంటల తరబడి మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి.
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో శనగపిండి తీసుకుని అందులో వాము, జీలకర్ర, పసుపు, కారం, ఆమ్చూర్, గరం మసాలా, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలపాలి. దానికి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మరీ పలుచగా కాకుండా, ముక్కలకు బాగా పట్టేలా సెమీ-థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఆపై వేడి నూనె వేసి మరోసారి కలపాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలూ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను ఈ పిండిలో ముంచి సమానంగా కోటింగ్ ఇవ్వాలి. ఒక బాండీలో నూనెను మీడియం ఫ్లేమ్‌లో కాగనిచ్చి, ఒక్కొక్కటిగా పిండి ముక్కలను నూనెలో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి, క్రిస్పీగా మారేంతవరకు డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. పైన కాస్త చాట్ మసాలా చల్లుకుని, పుదీనా చట్నీ లేదా వేడివేడి టీతో తింటే.. బయట బండి మీద దొరికే వాటిని కూడా మర్చిపోతారు. కుదిరితే ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి.. ప్లేట్ ఖాళీ అయ్యేదాకా ఎవరూ ఆగరు.

