Site icon NTV Telugu

Chana Dal Vada : శనగపప్పుతో వడలను ఇలా చేసుకుంటే అస్సలు వదలరు..

Chanadhal Vada

Chanadhal Vada

శనగపప్పు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తాలింపు దినుసుగా వాడతారు.. కూరలు, స్వీట్స్, స్నాక్స్ ఇలా ఎన్నో రకాల వంటలను తయారు చేసుకుంటుంటారు.. అయితే ఈ పప్పుతో మనం రుచిగా, కరకరలాడుతూ ఉండే వడలను కూడా తయారు చేసుకోవచ్చు. శనగపప్పుతో చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి చాలా చక్కగా ఉంటాయి. ఎంతో రుచిగా ఉంటాయి.. బయట తొలకరి చినుకులు పడుతుంటే లోపలికి వేడి వేడి వడ వెళుతుంటే ఏముంటుంది.. ఎన్ని తిన్నామో కూడా తెలియదు.. చెప్తుంటే నోరు ఊరుతుంది కదూ.. ఇక ఆలస్యం ఎందుకు ఒకసారి ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు..

శనగపప్పు – 2 కప్పులు,

పచ్చిమిర్చి – 2,

ఎండుమిర్చి – 1,

వెల్లుల్లి రెబ్బలు – 3,

చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1,

తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ,

ఉప్పు – తగినంత,

నూనె – డీప్ ఫ్రైకు సరిపడా,

తరిగిన కొత్తిమీర – కొద్దిగా,

బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్,

జీలకర్ర – ఒక టీ స్పూన్..

తయారీ విధానం..

ముందుగా శనగపప్పును కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని మూడు గంటలు నానబెట్టాలి..గుప్పెడు పప్పును పక్కన పెట్టుకోవాలి..తరువాత ఈ శనగపప్పును ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇదే జార్ లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి..ఈ పిండిలో అన్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.. తరువాత చేతులకు నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వడల ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.నూనె వేడయ్యాక వడలను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగపప్పు వడలు తయారవుతాయి.. వీటిని అలానే తినవచ్చు లేదా మీకు నచ్చిన చట్నీతో తినవచ్చు.. ఈవెనింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి.. అస్సలు వదలకుండా ఖాళీ చేస్తారు.. ట్రై చెయ్యండి..

Exit mobile version