Health Tips: చైనాకు చెందిన ప్రఖ్యాత బాడీబిల్డింగ్ ఛాంపియన్ వాంగ్ కున్ కేవలం 30 ఏళ్ల వయసులో మరణించారు. అయితే చాలా మంది ఆయన మరణానికి గుండె సమస్య కారణం అని నమ్ముతారు. కానీ ఆయనకు మద్యం, సిగరెట్లు, ఎలాంటి అనారోగ్యకరమైన అలవాట్లు లేవు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అలాంటి వ్యక్తికి గుండె సమస్యలు ఎలా వచ్చాయి అనేది? దీనికి అధిక వ్యాయామం కారణమా, లేదా మరేదైనా కారణం ఉందా? అసలు ఏమైందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Atal Modi Suparipalana Yatra: ఓటమిని అంగీకరించని వ్యక్తి వాజ్ పేయ్..
చైనాకు చెందిన వాంగ్ ప్రముఖ బాడీబిల్డర్లలో ఒకరు. ఆయన వరుసగా ఎనిమిది జాతీయ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్నాడు. ఆయన క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడంతో పాటు, శారీరక శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన మరణంపై ఢిల్లీలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్ కార్డియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అజిత్ జైన్ మాట్లాడుతూ.. వైద్య పరీక్ష తర్వాతే ఆయన మరణానికి కారణం తెలుస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా బాడీబిల్డర్లలో గుండెపోటు కేసులు పెరిగాయి. ఈ మరణానికి ఇది ఒక్కటే కారణం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు COVID-19 మహమ్మారి నుంచి చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు తలెత్తున్నాయి. ఒక వ్యక్తి ఫిట్‌గా ఉన్నప్పటికీ, బాగా తింటూ, వ్యాయామం చేస్తున్నా, కూడా గుండె సమస్య వస్తుందని అన్నారు. ఇలాంటి వారిలో కొన్ని సందర్భాలలో రక్తం గడ్డకట్టడం వల్ల గుండెకు రక్త ప్రసరణ సరిగా ఉండదని, ఆ టైంలో గుండెపై ఒత్తిడి పెరుగుతుందని, ఇది గుండెపోటుకు దారితీస్తుందని చెప్పారు.
దీనికి మరొక కారణం కూడా ఉందని తెలిపారు. కొంతమంది బాడీబిల్డింగ్ కోసం అధిక మోతాదులో స్టెరాయిడ్లు తీసుకుంటూ సంవత్సరాలుగా వాటిని అలానే కొనసాగిస్తున్నారని చెప్పారు. అయితే స్టెరాయిడ్లు గుండెను ప్రభావితం చేస్తాయని చెప్పారు. కొన్ని సందర్భాల్లో అవి గుండెపోటుకు కారణమవుతాయని వెల్లడించారు. గుండెపోటుకు స్టెరాయిడ్లు నేరుగా కారణం కాకపోయినా, అవి గుండె పనితీరును ప్రభావితం చేస్తాయని చెప్పారు. స్టెరాయిడ్లను ఎక్కువ మోతాదులో తీసుకుంటే గుండెపోటుకు దారితీస్తుందని అన్నారు. ఇటీవల కాలంలో స్టెరాయిడ్ల కారణంగా గుండెపోటు కేసుల సంఖ్య పెరిగిందన్నారు.
డాక్టర్ జైన్ మాట్లాడుతూ.. అధిక వ్యాయామం గుండెపై ప్రభావం చూపకపోయినా, అకస్మాత్తుగా చేసే భారీ వ్యాయామాలు గుండెపై ప్రభావం చూపుతాయని అన్నారు. భారీ బరువులు ఎత్తడం వల్ల గుండెపై అధిక ఒత్తిడి పడుతుందని, ఇది గుండె కండరాలను మందంగా చేస్తుందని, అలాగే అసాధారణ హృదయ స్పందనల ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించారు.
వీటిని గుర్తుంచుకోండి..
భారీ వ్యాయామాలు ఎప్పుడూ అకస్మాత్తుగా చేయవద్దు.
డాక్టర్ సలహా మేరకు మాత్రమే స్టెరాయిడ్లు తీసుకోవాలి.
మీ ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి.
మానసిక ఒత్తిడికి గురికావద్దు..
READ ALSO: Okra Waterతో వెయిట్ లాస్? నిపుణులు చెబుతున్నది ఇదే!
