Neha Thakur: సాధారణంగా అమ్మాయిలు ఎయిర్ హోస్టెస్ కావాలని కలలు కంటారు. కానీ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల నేహా ఠాకూర్ మాత్రం తన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుకుంది. ఎయిర్ హోస్టెస్‌గా శిక్షణ తీసుకున్న ఆమె, చివరికి కొండల మధ్య భారీ ట్రక్కుకు స్టీరింగ్ పట్టుకుంది. ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రక్ నడుపుతూ, తన ప్రయాణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అసలు ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్న నేహా ట్రక్ డ్రైవర్‌గా ఎందుకు మారింది? ఈ ప్రయాణం వెనుక ఉన్న కథేంటి? అనే వివరాల్లోకి వెళ్తే..
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ జిల్లా సర్కాఘాట్ ప్రాంతంలోని ఖుద్లా గ్రామానికి చెందిన నేహాకు చిన్నప్పటి నుంచే ట్రక్కులతో పరిచయం ఉంది. అందుకు కారణం ఆమె తండ్రి రాజేష్ ఠాకూర్. ఆయన చాలా సంవత్సరాలుగా ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. చిన్నతనంలో నేహా కూడా తండ్రి ట్రక్కులో ప్రయాణించేది. కొన్నిసార్లు అదే ట్రక్కులో స్కూల్‌కు కూడా వెళ్లేది. అప్పట్లో సరదాగా అనిపించిన ఆ ప్రయాణాలే ఆమెకు భారీ వాహనాలపై ఆసక్తిని పెంచాయి.
అయితే పెరిగేకొద్దీ నేహా మరో కలను ఎంచుకుంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత చండీగఢ్ వెళ్లి ఎయిర్ హోస్టెస్‌గా శిక్షణ తీసుకుంది. విమానయాన రంగంలోనే కెరీర్ కొనసాగించాలని అనుకుంది. కానీ కరోనా మహమ్మారి సమయంలో విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతినడంతో ఆమె కెరీర్ ప్లాన్ ఒక్కసారిగా మారిపోయింది. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడంతో నేహా తిరిగి తన స్వగ్రామానికి వచ్చింది. అక్కడే చిన్నప్పటి నుంచి తనలో ఉన్న ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ నే కెరీర్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకుంది.
అలా నేహా ట్రక్ డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. భారీ వాహనాన్ని నడపడం అంత సులభం కాదు. గేర్ మార్పులు, క్లచ్ కంట్రోల్, బ్రేకింగ్‌తో పాటు కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్‌కు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలు నేర్చుకోవాల్సి వచ్చింది. 21 ఏళ్ల వయసులో హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా పొందింది. మొదట లోకల్ మార్గాల్లో ట్రక్ నడిపిన ఆమె, క్రమంగా దూర ప్రయాణాలు, అంతర్రాష్ట్ర రూట్ల వైపు వెళ్లింది.
ఇప్పుడు నేహా భారీ టాటా ట్రక్కుతో దేశంలోని వివిధ రోడ్లపై ప్రయాణిస్తోంది. ముఖ్యంగా హిమాచల్‌లోని కొండ ప్రాంతాల్లో ట్రక్ నడపడం అంత తేలికైన పని కాదు. ఇరుకైన రోడ్లు, భారీ మలుపులు, పొగమంచు, వర్షం, మారుతున్న వాతావరణ పరిస్థితులు ప్రతి ప్రయాణంలోనూ సవాలుగా ఉంటాయి. దానికి తోడు ఎక్కువ గంటలు రోడ్డుపైనే ఉండటం, సమయానికి భోజనం దొరకకపోవడం, ఇంటికి దూరంగా రాత్రులు గడపడం వంటి ఇబ్బందులు కూడా ఉంటాయి.
అయితే నేహా కథలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఆమె ట్రక్ నడపడమే కాదు.. తన ట్రక్‌లో కెమెరాను కూడా పెట్టుకుంది. ప్రతిరోజూ రోడ్డుపై ఎదురయ్యే అనుభవాలు, కొండ మార్గాలు, వర్షం, పొగమంచు, సరుకు లోడింగ్, అన్‌లోడింగ్, ట్రక్ నిర్వహణ వంటి విషయాలను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తన రోజువారీ జీవితమే తన కంటెంట్ అని నేహా చెప్పింది. ట్రక్ స్టార్ట్ అయినప్పుడు కెమెరా కూడా స్టార్ట్ అవుతుందని ఆమె వివరించింది.
ఈ వీడియోలకు సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. 2026లో వచ్చిన పలు రిపోర్టుల ప్రకారం నేహాకు యూట్యూబ్‌లో 4.5 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 8 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నట్లు సమాచారం. ఆమె వీడియోల్లో గ్లామర్ కంటే ట్రక్ డ్రైవర్ జీవితంలోని అసలు కష్టాలే ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ఆమె కంటెంట్‌కు ప్రత్యేకమైన ప్రేక్షకులు ఏర్పడ్డారు.
మహిళలు ట్రక్ ఎందుకు నడపాలి అని కొందరు ప్రశ్నించినప్పుడు నేహా ఇచ్చే సమాధానం చాలా సింపుల్‌గా ఉంటుంది.. ట్రక్ ఎందుకు నడపకూడదు? ట్రక్ డ్రైవర్లను సమాజం తక్కువగా చూడకూడదని, ఈ వృత్తి గురించి ఉన్న అభిప్రాయాలు మారాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె చెప్పింది. తన ప్రయాణం ద్వారా మరింత మంది మహిళలు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవాలని ప్రోత్సహించాలనుకుంటోంది.
ఒకప్పుడు విమానంలో ప్రయాణించే కెరీర్ కోసం శిక్షణ తీసుకున్న నేహా.. ఇప్పుడు కొండల మధ్య భారీ ట్రక్కును నడుపుతోంది. బాల్యంలో తండ్రి ట్రక్కులో స్కూల్‌కు వెళ్లిన అమ్మాయి, కొన్నేళ్ల తర్వాత అదే వాహన ప్రపంచాన్ని తన వృత్తిగా మార్చుకుంది. ఎయిర్ హోస్టెస్ నుంచి ట్రక్ డ్రైవర్‌గా మారిన నేహా కథ కెరీర్ లో మార్పు మాత్రమే తీసుకురాలేదు.. మనకు నచ్చిన దారిని ఎంచుకోవడానికి వయసు, సమాజం, పరిస్థితులు అడ్డంకులు కావాల్సిన అవసరం లేదని చెప్పే ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని కూడా చూపించింది.

