Site icon NTV Telugu

AIDS Day : హెచ్‌ఐవీ నిజంగా నయం అవుతుందా.? ఆశాజనకమే.. కానీ..

Aids Day

Aids Day

AIDS Day : నేటికీ ప్రపంచాన్ని అత్యంతగా భయపెడుతున్న అంటువ్యాధుల్లో హెచ్‌ఐవీ ప్రథమస్థానం దక్కించుకుంటుంది. ఆధునిక వైద్య శాస్త్రం ఎన్నో అద్భుతాలను సృష్టించినా, హెచ్‌ఐవీ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే దిశలో ఇంకా ఆశించిన స్థాయిలో పురోగతి జరగకపోవడం ఆందోళన కలిగించే విషయమే. డిసెంబర్‌ 1 ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా, ఈ వైరస్‌పై జరుగుతున్న తాజా పరిశోధనలు, చికిత్సా పద్ధతుల్లో కనిపిస్తున్న మార్పులు, ఎదురవుతున్న అడ్డంకులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపడుతున్న చర్యలు.. హెచ్‌ఐవీపై ప్రపంచం సాగిస్తున్న నిరంతర పోరాటాన్ని అర్థం చేసుకునేందుకు సహాయపడతాయి.

గత దశాబ్దాల‌తో పోలిస్తే ఈ వ్యాధి చికిత్సలో శాస్త్రవేత్తలు గణనీయమైన పురోగతిని సాధించారనే చెప్పాలి. ముఖ్యంగా యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) రాకతో హెచ్‌ఐవీ డయాగ్నోసిస్‌ ఇక జీవితాంతం బాధకు ప్రతీకగా మిగలకుండా పోయింది. ఈ చికిత్స వైరస్‌ను శరీరంలో పూర్తిగా తొలగించకపోయినా, దాని చురుకుదనాన్ని అణచి బాధితులు సాధారణ మానవుల్లాగే జీవితాన్ని కొనసాగించేందుకు వీలు కల్పిస్తోంది. అయితే వైరస్‌ను శాశ్వతంగా నిర్మూలించే చికిత్స ఎప్పటికి అందుబాటులోకి వస్తుందన్న ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానం దొరకలేదు. కొన్ని పరిశోధనలు ఎంతో ఆశాజనకంగా ఉన్నప్పటికీ, అవి సామూహికంగా అమలు చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుంది.

ఈ నేపథ్యంలో స్టెమ్‌ సెల్ మార్పిడితో పూర్తిస్థాయి ఉపశమనాన్ని పొందిన బెర్లిన్, లండన్‌ రోగుల కేసులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సీసీఆర్‌5 అనే గ్రాహకంలో ఏర్పడిన ప్రత్యేక మార్పుని కలిగి ఉన్న దాతల స్టెమ్ సెల్స్ రోగులకు మార్పిడి చేయడంతో, వైరస్ కణాల్లోకి ప్రవేశించే మార్గమే నిలిచిపోయినట్టు తేలింది. ఈ ‘ఫంక్షనల్ క్యూర్’ కేసులు హెచ్‌ఐవీని బయోలాజికల్‌గా పూర్తిగా తొలగించే ఛాన్స్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే స్టెమ్ సెల్ మార్పిడులు ప్రాణాంతక ప్రమాదాలు కలిగించే అవకాశం ఉండటంతో సాధారణ హెచ్‌ఐవీ రోగులకు ఈ చికిత్స ఆచరణీయ మార్గం కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇక.. హెచ్‌ఐవీ చికిత్సలో ఇప్పటికీ ఎదురవుతున్న అతి పెద్ద సవాల్‌ వైరల్ రిజర్వాయర్లు. ఇవి శరీరంలోని కొన్ని కణజాలాల్లో నిశ్శబ్దంగా దాగి ఉంటాయి. చికిత్సను ఆపిన వెంటనే ఈ దాగి ఉన్న వైరస్ మళ్లీ చురుకుదనంతో పెరిగి రోగిని మళ్లీ ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు క్రిస్పర్‌ వంటి జన్యు ఎడిటింగ్ టెక్నాలజీలను, CCR5 గ్రాహకాన్ని లక్ష్యంగా చేసుకునే జీన్ల సవరణ పద్ధతులను, పూర్తిగా కొత్త తరహా యాంటీవైరల్ చికిత్సలను అన్వేషిస్తున్నారు. ప్రారంభ దశలో లభిస్తున్న ఫలితాలు ఉత్సాహపూరితంగా ఉన్నప్పటికీ, ఇవి క్లినికల్ స్థాయిలో సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావడానికి చాలా టైమే పడుతుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం హెచ్‌ఐవీ నియంత్రణలో అత్యంత ప్రభావవంతమైన మార్గం యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART)నే. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలోని వైరల్ లోడ్ తగ్గుతుంది. దాంతో రోగికి ఉపశమనం మాత్రమే కాదు, ఇతరులకు వైరస్ సంక్రమణ జరగడానికి అవకాశం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా అసురక్షిత లైంగిక సంపర్కమే హెచ్‌ఐవీ వ్యాప్తికి ప్రధాన కారణం కావడంతో, సురక్షిత పద్ధతుల పాటించడం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.

ఇక ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘అంతరాయాలను అధిగమించడం, ఎయిడ్స్‌ ప్రతిస్పందనను మార్చడం’ అనే థీమ్‌ను ప్రకటించింది. సమాజంలో హెచ్‌ఐవీ బాధితులపై ఉన్న వివక్షను తొలగించడం, అవగాహన పెంచడం, ఆరోగ్య సేవలు అందరికీ చేరేలా చేయడం ప్రధాన లక్ష్యాలుగా తెలిపింది. 2030 నాటికి ఎయిడ్స్‌ను పూర్తిగా అంతం చేసే లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేశాలందరి సహకారం అవసరమని WHO హెచ్చరిస్తోంది.

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, గోప్యంగా హెచ్‌ఐవీ పరీక్షలు, బాధితులకు ART మందుల పంపిణీ, రెడ్ రిబ్బన్ క్యాంపెయిన్లు, WHO నిర్వహించే వెబ్‌నార్‌లు, మరణించిన వారి జ్ఞాపకార్థం కొవ్వొత్తుల ర్యాలీలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కలిపి చూసినా, హెచ్‌ఐవీపై పోరాటం ఒకరోజులో ముగిసే యుద్ధం కాదని, కానీ విజయం దిశగా ప్రపంచం అడుగులు వేస్తూనే ఉందని స్పష్టమవుతోంది.

Exit mobile version