Site icon NTV Telugu

child development : నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల పిల్లల పెంపకంలో తప్పక తెలుసుకోవాల్సిన 5 సంకేతాలు..

Raising 4–5 Year Old Children

Raising 4–5 Year Old Children

నాలుగు నుండి ఐదు ఏళ్ల వయసు పిల్లల పెంపకం అనేది చాలా సున్నితమైన దశ. ఈ వయసులో పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, తమ భావాలను మొదటిసారి సరిగ్గా వ్యక్తం చేయడం నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు ఈ దశలో ఓపిక, అవగాహన, ప్రేమతో వ్యవహరించడం చాలా ముఖ్యం. చిన్న చిన్న తప్పిదాలపై గట్టిగా మాట్లాడటం లేదా శిక్షించడం వంటివి వారి మనసులో భయం, అసహనం లేదా తక్కువ ఆత్మవిశ్వాసం పెంచే ప్రమాదం ఉంది. ఇప్పటి పరిస్థితుల్లో, గాడ్జెట్‌లు, టీవీలు, సోషల్ మీడియా ప్రభావం మధ్య పిల్లల్ని సమతుల్యంగా పెంచడం అంత ఈజీ కాదు. కానీ మీరు మీ బిడ్డ ప్రవర్తనలో కొన్ని చిన్న సంకేతాలను గమనిస్తే, వారు సంతోషంగా, భద్రంగా ఎదుగుతున్నారని నిర్ధారించుకోవచ్చు. ఈ క్రింద చెప్పిన 5 సంకేతాలు అచ్చంగా ఆ విషయాన్నే చెబుతాయి.

1. ఊహాలోకంలో మునిగిపోవడం (Daydreaming)
మీ బిడ్డ బొమ్మలతో మాట్లాడటం, ఊహాజనిత పాత్రలు సృష్టించడం, బ్లాక్స్‌తో ఏదో నిర్మించడం లేదా తమ ఊహాలోకంలో తేలిపోవడం – ఇవన్నీ ఒక మంచి సంకేతం. అంటే వారు తమ చుట్టూ ఉన్న వాతావరణంలో సురక్షితంగా ఉన్నారనే నమ్మకంతో, స్వేచ్ఛగా ఆలోచించ గలుగుతున్నారు. పిల్లలు సేఫ్‌గా ఉన్నప్పుడు మాత్రమే వారి మెదడు కొత్త విషయాలు ఊహించగలదు, సృజనాత్మక ఆలోచన (Creative Thinking) పెంచుకుంటుంది. ఇది మీ బిడ్డ మానసికంగా, భావోద్వేగంగా ఆరోగ్యంగా ఎదుగుతున్నారనే సంకేతం కూడా.

2. మీ అభిప్రాయం తో ఏకీభవించక పోవడం (Disagreeing Confidently)
మీరు చెప్పిన మాటకు మీ బిడ్డ “అది సరైంది కాదు” అని నేరుగా చెప్పగలిగితే, అది వారి ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి (Confidence) సూచన. అంటే వారు మిమ్మల్ని విశ్వసిస్తున్నారు, మీ ముందు తమ భావాలను స్వేచ్ఛగా చెప్పగలరని అర్థం. తల్లిదండ్రుల మాటకు భయపడి కాకుండా, ఆలోచించి స్పందించడం అనేది పిల్లల్లో ఉన్న ఆరోగ్యకరమైన మానసిక ఎదుగుదలకి చిహ్నం. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగల ధైర్యమైన వ్యక్తులుగా ఎదుగుతారు.

3. మీ చేష్టలను అనుకరించడం (Copying You)
మీ పిల్లలు మీ మాటలు, హావభావాలు, మాట్లాడే తీరును లేదా నడిచే రీతిని కూడా అనుకరిస్తుంటే అది చిన్న విషయం కాదు, చాలా ముఖ్యమైన సంకేతం. దీని అర్థం మీరు వారికి ఆదర్శంగా (Role Model) మారారు అనే మాట. పిల్లలు మిమ్మల్ని గమనిస్తూ “నేను కూడా అమ్మ లా లేదా నాన్న లాగా ఉండాలి” అని భావించడం అనేది ప్రేమ, భద్రత, మరియు గౌరవంతో కూడిన బంధానికి సూచన. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో వారు అదే నేర్చుకుంటారు కాబట్టి, మీ ప్రవర్తన, మాట తీరు, మరియు వైఖరిలో పాజిటివ్ ఉదాహరణ చూపించడం ఎంతో ముఖ్యం.

4. మీ దగ్గర అల్లరి చేయడం, నవ్వడం (Being Playful Around You)
మీ దగ్గర ఉన్నప్పుడు మీ పిల్లలు నవ్వుతూ, సరదాగా అల్లరి చేస్తూ, వింత ముఖాలు పెట్టడం లేదా మీతో సరదాగా ముచ్చటించడం ఇవన్నీ వారు మీతో సురక్షితంగా, సంతోషంగా ఉన్నారనే సూచనలు. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలు స్వేచ్ఛగా ప్రవర్తించగలిగితే, అది వారి మనసు ప్రశాంతంగా ఉందని అర్థం. కానీ వారు మీ ముందు మౌనంగా ఉండటం, కేవలం “అవును అమ్మా” లేదా “సరే నాన్నా” అని మాత్రమే చెప్పడం మొదలు పెడితే, అది కొంత భయం లేదా ఆత్మవిశ్వాసం లోపాన్ని సూచిస్తుంది. కాబట్టి పిల్లలు మీ చుట్టూ నవ్వుతూ, ఆడుకుంటూ ఉంటే అది మీరు వారికి భద్రత, ప్రేమ, మరియు నమ్మకాన్ని అందిస్తున్నారన్న పెద్ద సంకేతం.

5 . తమ భావాలను పంచుకోవడం (Sharing Emotions)
మీ బిడ్డ కోపం వచ్చినప్పుడు ఏడుస్తూ “నాకు మీరంటే ద్వేషం!” లేదా “నాకు ఇది నచ్చలేదు!” అని చెప్పితే వెంటనే కోపపడకండి. ఇది వారి మనసు లోపల ఉన్న భావాలను భయపడకుండా బయటపెట్టగల ధైర్యానికి సంకేతం. పిల్లలు తమ భావాలను చెప్పగలగడం అంటే, మీరు వారిలో నమ్మకం, భద్రతా భావాన్ని పెంచుతున్నారని అర్థం. ఇది జెంటిల్ పేరెంటింగ్‌లో అత్యంత ముఖ్యమైన ఫలితాల్లో ఒకటి. ఇలాంటి పిల్లలు పెద్దయ్యాక కూడా తమ భావాలను అర్థం చేసుకోవడంలో, పంచుకోవడంలో వెనుకాడరు ఇది మంచి మానసిక ఆరోగ్యానికి, బలమైన వ్యక్తిత్వానికి బాటలు వేస్తుంది.

Exit mobile version