Railway Recruitment 2026: రైల్వేలో 1,644 ఉద్యోగాలు.. టెన్త్ పాస్ అయితే చాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక

Trains

Trains

Railway Recruitment 2026: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) యువతకు భారీ ఉద్యోగావకాశాన్ని ప్రకటించింది. 2026-2027 సంవత్సరానికి గాను ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,644 ఖాళీలను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా ఈ నియామకంలో ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేకపోవడం అభ్యర్థులకు పెద్ద ఊరటనిస్తోంది. భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలని కలలు కనే యువతకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, స్టెనోగ్రాఫర్ వంటి పలు ట్రేడ్స్‌లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు ఏమిటి?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరి. వయోపరిమితి విషయానికి వస్తే కనీస వయస్సు 15 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 24 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

పరీక్ష లేకుండానే ఎంపిక
ఈ నియామక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించరు. 10వ తరగతి మార్కులు, ఐటీఐ మార్కులకు సమాన ప్రాధాన్యత ఇస్తూ మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. ఈ రెండు మార్కుల సగటు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌కు పిలుస్తారు.

దరఖాస్తు తేదీలు
దరఖాస్తు ప్రక్రియ మే 5 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన Apprenticeship India ను సందర్శించి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత సంబంధిత ఉద్యోగ నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేసి అవసరమైన వివరాలను నమోదు చేసి దరఖాస్తును సమర్పించాలి. రైల్వేలో ఉద్యోగం సాధించాలని భావిస్తున్న టెన్త్ పాస్ మరియు ఐటీఐ అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.