AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..

Ap Tet

Ap Tet

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET-2026) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా విడుదల చేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేస్తూ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడితో పాటు డీఎస్సీ (DSC) నోటిఫికేషన్‌పై కూడా పూర్తి స్పష్టతనిచ్చారు. జూన్ 5వ తేదీన అధికారికంగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జూన్ 5 నుంచి జులై 5వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 25వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) జరగనున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్-2026 ఫలితాలను విడుదల చేస్తారు.

అక్టోబరులో డీఎస్సీ నోటిఫికేషన్…
టెట్ ఫలితాలు విడుదలైన వెంటనే, అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్‌ను ఈ ఏడాది అక్టోబరులో విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రణాళికాబద్ధంగా ఖాళీలను భర్తీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

×
×
Ad

ఈసారి టెట్ ఎందుకు కీలకం.. ?
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు (ఇన్-సర్వీస్ టీచర్స్) కూడా ప్రమోషన్లు లేదా సర్వీస్ నిబంధనల పరంగా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఈసారి పోటీ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. 2011కు ముందు నియామకమైన దాదాపు లక్ష మంది ఉపాధ్యాయులకు గతంలో మినహాయింపు ఉన్నప్పటికీ, తాజా కోర్టు తీర్పుల నేపథ్యంలో వారు కూడా ఈ పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్నారు. దీనికి తోడు కొత్తగా డీఈడీ (D.El.Ed), బీఈడీ (B.Ed) పూర్తి చేసిన అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా, సాంకేతిక పద్ధతుల్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అభ్యర్థులు ఇప్పటి నుంచే అధికారిక వెబ్‌సైట్ (aptet.apcfss.in) ద్వారా సిలబస్ వివరాలను పరిశీలించి ప్రిపరేషన్ ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.