Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్ తీవ్రం అవుతోంది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ పట్టణం బఖ్‌ముత్ లక్ష్యంగా ముందుకు కదులుతోంది. ఈ పట్టణం రష్యా వశం అయితే ఉక్రెయిన్ యుద్ధంపై పట్టుకోల్పోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా సైన్యం ఎట్టి పరిస్థితుల్లో అయినా బఖ్‌ముత్ ను స్వాధీనం చేసుకుంటుందని ఆ దేశం పట్టుదలతో ఉంది. ఇదిలా ఉంటే ఇదే జరిగితే తూర్పు ఉక్రెయిన్ లోకి రష్యాకు ‘‘ఓపెన్ రోడ్’’గా మారుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ పేర్కొన్నట్లు అమెరికన్ మీడియా మంగళవారం నివేదించింది.
Read Also: Wedding Card : పెళ్లికి ఒక్కమ్మాయే దొరకడం లేదంటే.. నీకు ఇద్దరా.. గ్రేట్ బాసూ
బఖ్‌ముత్ తరువాతా మరింగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని క్రమాటోర్స్కి, స్లోవియన్స్కి వరకు వెళ్లవచ్చని, డొనెట్స్క్ దిశగా ఇది రష్యన్లకు బహిరంగ రహదారి అవుతుందని జెలన్ స్కీ సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యుద్ధానికి ముందు 80,000 జనాభా కలిగి ఉన్న బఖ్‌ముత్ పట్టణం, రష్యా దాడిలో తీవ్రంగా నష్టపోయింది. ఏ విధంగా అయినా రష్యా బఖ్‌ముత్ ను స్వాధీనం చేసుకునే ఉద్దేశ్యంతో ఉంది. ఈ పట్టణం కోసం ఉక్రెయిన్ తీవ్ర ప్రయత్నం చేస్తోంది.
ఏడాది గడిచినా.. ఈ యుద్ధానికి తెరపడే అవకాశం కనిపించడం లేదు. ఉక్రెయిన్ అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాలు ఇస్తున్న ఆర్థిక, ఆయుధ సాయంతో రష్యాను ఎదురిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ ఈ యుద్ధంలో జపొరోజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలను కోల్పోయింది. ఈ మొత్తం యుద్ధానికి అమెరికానే కారణం అంటూ రష్యా ఆరోపిస్తోంది. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యాపై అమెరికా, ఇతర దేశాలు ఆంక్షలు విధించినా రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
