Site icon NTV Telugu

Ukraine Russia War: జెలెన్‌స్కీ కీలక నిర్ణయం

ఉక్రెయిన్‌ను హస్తగతం చేసుకునేందుకు రష్యా భీకర దాడులు చేస్తోంది. ప్రధాన నగరాలపై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఏకధాటిగా బాంబులు, మిసైల్స్ తో నివాస భవనాలపై దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్ సైన్యం సైతం ఆ దాడులను సమర్థంగా ఎదుర్కొంటోంది. రష్యా విధ్వంసం సృష్టించడంతో మరియుపోల్ సిటీలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఎటు చూసినా శిథిల భవనాలు, వాటి నుంచి విడుదలవుతున్న పొగతో శ్మశాన వాతావరణం నెలకొంది. గత 20 రోజులుగా ఉక్రెయిన్‌పై దాడులు నిర్వహిస్తున్న రష్యా.. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా దాడులు ముమ్మరం చేసింది. ఉదయం స్వియాటోషిన్ స్కీ డిస్ట్రిక్‌లోని 16 ఫ్లోర్ల బిల్డింగ్‌పై జరిగిన దాడిలో ఇద్దరు చనిపోయారని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 27 మందిని రక్షించామన్నారు అధికారులు. దాడుల కారణంగా కీవ్ సమీపంలోని అంటోనోవ్ ఏవియేషన్ ఇండస్ట్రీ పార్క్ మంటల్లో చిక్కుకుంది.

Read Also: Covid 19: వ్యాక్సినేషన్‌లో మరింత స్పీడ్.. పిల్లలకు, పెద్దలకు..

కీవ్‌ సహా… కీలక నగరాలను స్వాధీనం చేసుకోవాలని యత్నిస్తున్న పుతిన్ సేనలను ఉక్రెయిన్ ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ పోరులో భారీ సంఖ్యలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఇప్పటివరకు 13వేల 500 మంది రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్ సైన్యం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక.. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 596 మంది పౌరులు మరణించారని ప్రకటించింది. అయితే, ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. యుద్ధంతో లక్షలాది ప్రజలు తమ ఇళ్లను విడిచి పక్కదేశాలకు వలసపోతున్నారు. ఇప్పటివరకు 30లక్షల మంది ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటి పొరుగుదేశాలకు వెళ్లిపోయారు. గత 20 రోజులుగా ఉక్రెయిన్‌లో సగటున ప్రతిరోజూ 70 వేల మందికి పైగా చిన్నారులు శరణార్థులుగా మారుతున్నారని యునిసెఫ్‌ తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటివరకు దాదాపు 1.5 మిలియన్ల మంది చిన్నారులు దేశం విడిచి నుంచి బలవంతంగా తరలి వెళ్లారు. యుద్ధం ప్రారంభమైనప్పట్నుంచి ప్రతి నిమిషానికి దాదాపు 55 మంది పిల్లలు.. ప్రతి సెకనుకు దాదాపుగా ఒక పిల్లవాడు శరణార్థిగా మారుతున్నాడు.

అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మరో 30 రోజులపాటు మార్షల్ లా పొడగించేలా బిల్లు ప్రవేశపెట్టారు. రిజర్వ్ బలగాల కోసం 18 నుంచి 60 ఏళ్లలోపు ఆరోగ్యంగా ఉన్న పురుషులు ఉక్రెయిన్ వదిలి వెళ్లేందుకు అనుమతి లేదని ప్రకటించారు జెలెన్ స్కీ. రష్యా బలగాలు చుట్టుముట్టిన ప్రాంతాల నుంచి సామాన్య పౌరుల తరలింపునకు 9 మానవతా కారిడార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది ఉక్రెయిన్‌. మరియుపోల్ నగరానికి సహాయ సామగ్రి చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు…ఈయుద్ధం మరో 10 రోజుల్లో ముగింపునకు చేరే అవకాశముందని అమెరికా మాజీ కమాండర్‌ అంచనా వేశారు. వనరుల కొరతతో రష్యా సేనలు దాడులను విరమించుకునే పరిస్థితి రానుందని యునైటెడ్‌ స్టేట్స్‌ ఆర్మీ యూరప్‌ మాజీ కమాండింగ్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బెన్‌ హోగ్స్‌ ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా యుద్ధం ఆపేందుకు నాటోతో కలిసేది లేదంటూ రష్యాతో కంప్రమైజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

Exit mobile version