సాహస విన్యాసాలతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన యెమెన్ ‘స్వైడర్ మ్యాన్’ అల్ అబ్సీ అగ్నిపర్వత బిలంలో పడి మృత్యువాతపడ్డాడు. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా సాహసోపేతమైన విన్యాసం చేయడంతో విఫలమై బిలంలో పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్లక్ష్యమే అతడి కొంపముంచిదంటూ అధికారులు చెబుతున్నారు.
30 ఏళ్ల అల్ ఖాఖా బిన్ అంతర్. సోషల్ మీడియాలో అంతర్ అల్ అబ్సీగా ప్రసిద్ధి చెందాడు. యెమెన్ దక్షిణ ప్రాంతంలోని అల్ ధలే ప్రావిన్స్‌లో ఉన్న హరాధత్ దమ్త్ అగ్నిపర్వత బిలం దగ్గర శుక్రవారం నిటారు గోడలను ఎక్కుతుండగా పట్టు కోల్పోయి బిలంలోకి పడిపోయాడు. యెమెన్ సివిల్ డిఫెన్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. హరాధత్ దమ్త్ అగ్నిపర్వత బిలం సుమారు 120 మీటర్ల లోతు ఉంటుందని.. అంతర్ అబ్సీ ఎలాంటి తాళ్లు, ఇతర భద్రతా పరికరాలు లేకుండానే ఎక్కే ప్రయత్నం చేశాడని తెలిపారు. సివిల్ డిఫెన్స్ విడుదల చేసిన వీడియోలో రాతి గోడను ఎక్కుతూ కనిపించాడు. అయితే కొద్ది క్షణాలకే పట్టు జారి అగాధంలో పడిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే ప్రత్యేక రెస్క్యూ బృందాలు.. బిలం లోతు ఎక్కువగా ఉండటం, రాతి ప్రాంతం కావడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి అంతర్ మృతదేహాన్ని వెలికితీశారు.
అంతర్ అల్ అబ్సీ యెమెన్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన అడ్వెంచర్ కంటెంట్ క్రియేటర్లలో ఒకరు. ప్రమాదకర పర్వతాలు, అగ్నిపర్వత ప్రాంతాలు, ఎత్తైన రాతి గోడలపై సాహస విన్యాసాలు చేస్తూ వీడియోలు రూపొందించేవాడు. ఇలాగున మంచి పాపులర్ అయ్యాడు. తాళ్లు, భద్రతా పరికరాలు లేకుండానే కొండలను అధిరోహించడం, ప్రమాదకర ప్రదేశాల్లో విన్యాసాలు చేయడంతో అతడికి “యెమెన్ స్పైడర్‌మ్యాన్” అనే పేరు వచ్చింది. ఇతడి వీడియోలు అరబ్‌లో విస్తృతంగా వైరల్ అవుతుంటాయి.
అంతర్ మరణ వార్తతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో పాత వీడియోలను పంచుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. కొందరు అతడిని ధైర్యసాహసాలకు ప్రతీకగా కొనియాడగా, మరికొందరు తగిన భద్రతా చర్యలు లేకుండా చేసే ప్రమాదకర సాహసాలు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో ఈ ఘటన గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటన అనంతరం యెమెన్ అధికారులు సాహస యాత్రికులు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని, తగిన రక్షణ పరికరాలు ఉపయోగించాలని హెచ్చరించారు. భద్రతను నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి విషాదాలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని సూచించారు.

