X Sign Removed From Twitter Headquarters After Neighbours Complain: తన ట్విటర్ హెడ్‌క్వార్టర్స్‌పై ఎలాన్ మస్క్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమర్చిన సరికొత్త ‘X’ లోగోను తాజాగా తొలగించారు. ఆ లోగోకి అమర్చిన రేడియెంట్ లైట్ల కారణంగా రాత్రి వేళల్లో తమ నిద్రకు భంగం కలుగుతోందని స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో పాటు నిబంధనల్ని అతక్రమిస్తూ లోగోని మార్చడం వల్ల నోటీసులు అందడంతో.. ఆ సంస్థ లోగోని భవనంపై నుంచి తొలగించాల్సి వచ్చింది.
ఈ కొత్త లోగోని శాన్‌ఫ్రాన్సిక్సోలోని ప్రధాన కార్యాలయంలో అమర్చిన తొలి వారాంతంలోనే.. ఆ లోగోకి సెట్ చేసిన రేడియెంట్ లైట్ల గురించి స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాని ప్రభావం తీవ్రంగా ఉందని, కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికితోడు.. ఓ నిబంధనని సైతం ట్విటర్ సంస్థ అతిక్రమించింది. ఒక సంస్థ తన లోగోని గానీ, గుర్తును గానీ మార్చాలని నిర్ణయం తీసుకున్నప్పుడు.. కచ్ఛితంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. ఎలాన్ మస్క్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ట్విటర్ లోగోని మార్చడంతో పాటు హెడ్‌క్వార్టర్స్‌పై పిట్ట లోగోని తొలగించి, X లోగోని అమర్చారు. దీంతో.. శాన్‌ఫ్రాన్సిక్సో అధికారులు విచారణకు ఆదేశించారు.
ఇలా ఒకవైపు స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో, లోగో మార్పుపై అధికారులు విచారణకు దిగడంతో.. ఎలాన్ మస్క్‌కి తప్పని పరిస్థితుల్లో వెనకడుగు వేయాల్సి వచ్చింది. లేనిపోని ఇబ్బందులు ఎందుకనుకొని.. లోగోని భవనంపై నుంచి తొలగించేశారు. అయితే.. ట్విటర్ సంస్థ వాదన మాత్రం మరోలా ఉంది. తాము స్వతహాగా ఈ లోగోని తొలగించామే తప్ప.. ఫిర్యాదులు అందడం వల్లనో, అధికారులు విచారిస్తున్నారో కాదని పేర్కొంది.