Queen Elizabeth-2: యూకేను అత్యధిక కాలం పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 (96) గురువారం స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్ క్యాజిల్‌లో కన్నుమూశారు. బ్రిటన్‌కు ఆమె ఏకంగా 70 ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. ‘‘ఈ మధ్యాహ్నం(గురువారం) బల్మోరల్‌లో రాణి ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు’’ అని బర్మింగ్‌హమ్ ప్యాలెస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మృతి పట్ల ప్రపంచ నాయకులు, రాజకీయ నాయకుల నుంచి సోషల్ మీడియాలో సంతాపం వెల్లువెత్తింది.
సంతాపం తెలిపిన ప్రధాని మోదీ: రాణి మరణం దేశానికి, ప్రపంచానికి తీరనిలోటని ఛార్లెస్, ప్రధాని లిజ్ ట్రస్ అభివర్ణించారు. ఆమె మరణం పట్ల పలువురు దేశాధినేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఎలిజబెత్-2 తన నాయకత్వంలో బ్రిటిష్ జాతికి స్ఫూర్తినందించారని భారత ప్రదాని మోదీ తన సంతాప సందేశంలో కొనియాడారు. ఆమె దృఢమైన నేతగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు.బరువెక్కిన హృదయంతో ఆమెకు నివాళులర్పిస్తున్నట్లు ప్రధాని ట్విటర్‌లో తెలిపారు. 2015-18లో బ్రిటన్ రాణితో జరిగిన సమావేశాలను గుర్తు చేసుకున్న మోదీ.. తన పట్ల ఆమె చూపిన ప్రేమ,కరుణను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. తన వివాహ సమయంలో మహాత్మాగాంధీ బహుమతిగా ఇచ్చిన చేతి రుమాలును బ్రిటన్ రాణి చూపించారని ఆయన వెల్లడించారు. రాణి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణం పట్ల ప్రపంచ దేశాధినేతలు విచారం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రజలకు స్ఫూర్తిమంతమైన నాయకత్వాన్ని అందించారంటూ పలువురు నేతలు కొనియాడారు. ఎలిజబెత్-2 మరణంతో ప్రపంచం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. బ్రిటన్ ప్రజలకు, రాణి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
యూకేను సుదీర్ఘ కాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 మరణం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం సంతాపం తెలిపారు.”క్వీన్ ఎలిజబెత్ II పట్ల శాశ్వతమైన అభిమానం కామన్వెల్త్ అంతటా ప్రజలను ఏకం చేసింది. ఆమె చరిత్ర సృష్టించిన ఏడు దశాబ్దాల పాలన అపూర్వమైన మానవ పురోగమనానికి, అభివృద్ధికి సాక్ష్యమిచ్చింది,” అన్నారాయన.
యూఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ రాజకుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేసారు. ” క్వీన్ ఎలిజబెత్ II మృతి పట్ల చాలా బాధపడ్డాను. ఆమె నాయకత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకున్నారు. ఆమె యూఎన్‌కి మంచి స్నేహితురాలు. ఆమె అచంచలమైన, జీవితకాల అంకితభావం చిరకాలం గుర్తుండిపోతుంది.” అని యూఎన్ సెక్రటరీ అన్నారు. ఆమె సేవలను ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది.
కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో కూడా ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. కెనడియన్లు క్వీన్ జ్ఞానాన్ని, కరుణ, ప్రేమను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారన్నారు. కెనడియన్లకు ఆమె చేసిన సేవ దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని ట్రూడో ట్వీట్ చేశారు.
ఆస్ట్రేలియన్ ప్రెసిడెంట్ ఆంథోనీ అల్బనీస్ ఒక ప్రకటనలో క్వీన్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. అత్యధిక కాలం పాలించిన సామ్రాజ్ఞి మృతి పట్ల దుఃఖిస్తున్న రాజకుటుంబానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం, ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇలా రాశారు. “క్వీన్ ఎలిజబెత్ II బ్రిటీష్ దేశం అభివృద్ధి కోసం, ఐక్యత కోసం 70 సంవత్సరాలకు పైగా కృషి చేసింది. నేను ఆమెను ఫ్రాన్స్ స్నేహితురాలిగా గుర్తుంచుకుంటాను. ఆమె శతాబ్దంపై శాశ్వత ముద్ర వేసిన దయగల రాణి.” అంటూ రాసుకొచ్చారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా కష్ట సమయాల్లో రాజ కుటుంబానికి సానుభూతి తెలిపారు. బ్రిటన్ రాణి మరణం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ ప్రజల తరఫున రాజకుటుంబానికి హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు.
క్వీన్ నిష్క్రమణ గొప్ప శూన్యతను సృష్టించిందని, ఇది రాబోయే కాలంలో పూరించడం కష్టమని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ అన్నారు.”ఆమె స్ఫూర్తిదాయకమైన నాయకత్వ లక్షణాలు ఆమెను ప్రపంచ చరిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో చిరస్మరణీయమైన గొప్ప, దయగల పాలకురాలిగా నిలబెట్టాయి. ఈ దుఃఖ సమయంలో గ్రేట్ బ్రిటన్ రాజకుటుంబ సభ్యులు మరియు ప్రజల పట్ల నా ఆలోచనలు వెల్లివిరుస్తున్నాయి.” అల్వీ అన్నారు.
1952-1972 మధ్య కామన్వెల్త్ అధిపతి, సిలోన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మరణానికి సంతాపంగా శ్రీలంక జెండాను అవనతం చేయాలని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు.
ఇజ్రాయెల్ ప్రభుత్వం, ప్రజల తరపున, ప్రధాన మంత్రి యైర్ లాపిడ్ రాజ కుటుంబానికి సంతాపం తెలిపారు. క్వీన్ మరణానికి గుర్తుగా జెండాలు అర మాస్ట్‌లో ఎగురవేస్తామని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ప్రకటించారు.క్వీన్ తన దేశానికి అత్యంత ప్రియమైన చిహ్నం, ప్రపంచవ్యాప్తంగా గౌరవం, ఆప్యాయత, అభిమానాన్ని పొందిందని ఇటాలియన్ ప్రధాన మంత్రి మారియో డ్రాగి రాశారు.
పోలిష్ ప్రధాన మంత్రి మాట్యూస్జ్ మొరావికీ మాట్లాడుతూ.. “మేము క్వీన్ ఎలిజబెత్ IIకి వీడ్కోలు పలుకుతున్నాము. ఆమె తన జీవితమంతా అంకితభావంతో తన దేశానికి సేవ చేసింది. ఆమె తన దేశాన్ని ఎలా నడిపించాలో తెలిసిన స్వయంత్యాగ, తెలివైన, వివేకవంతమైన నాయకురాలిగా తమ పాలన ద్వారా మాకు సేవ చేసింది.”
